
కొంగల గూళ్లు కూలిపోవడంతోపాటు వాటి పిల్లలు గాయాలతో మృత్యువాత పడ్డాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలివి. గోదావరిఖని అడ్డగుంటపల్లిలో రోడ్డు సమీపంలోని పెద్ద చింతచెట్టును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. దీంతో చెట్టుకొమ్మలపై పొదిగిన కొంగపిల్లలతో సేదదీరుతున్న వందలాది కొంగల గూళ్లు చెదిరిపోయాయి.
కొమ్మల కింద పడిన పిల్లలు పెద్దసంఖ్యలో చనిపోగా.. చాలావరకు గాయపడ్డాయి. గాయపడిన కొంగలు కొమ్మలపైనే గురువారం తెల్లవారేదాకా అరవడంపై పర్యావరణ, పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కొంగపిల్లల ఖననం, తీవ్రంగా గాయపడిన వాటికి చికిత్స, గూడు చెదిరిన వాటిని మరోచోటికి తరలించడానికి రామగుండం నగరపాలక సంస్థ, అటవీ, పశువైద్యాధికారులు రంగంలోకి దిగారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సతీశ్, జిల్లా పశువైద్యాధికారి శంకర్‌తోపాటు వైద్యుడు పల్లె ప్రసాద్, సిబ్బంది చంద్రశేఖర్, హ్యాండ్స్ టూ సర్వ్ ఎన్జీవో వ్యవస్థాపకుడు దేవినేని అరవింద్‌స్వామి సేవలు అందించారు.
కాగా, బతికిన కొంగలను కరీంనగర్‌లోని పార్క్‌కు తరలించారు. గాయపడిన కొంగల చికిత్సకు సుమారు రూ.8వేల వరకు తన సంస్థ ద్వారా వెచ్చించినట్లు అరవింద్‌స్వామి తెలిపారు. కాగా, చింతచెట్టు నరికివేతతో రామగుండం బల్దియాకు సంబంధం లేదని కమిషనర్ (ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ స్పష్టం చేశారు.
