పెట్‌ డాగ్‌ లైసెన్స్‌ ఇక ఈజీ

GHMC Said Pet Dog License Is Easy With Online - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ నిబంధనల మేరకు ప్రతి పెంపుడు కుక్క(పెట్‌డాగ్‌)కూ లైసెన్సు ఉండాలి. గ్రేటర్‌ నగరంలో దాదాపు 50 వేల పెట్‌డాగ్స్‌ ఉన్నప్పటికీ, ఇందులో లైసెన్సులున్నవి ఆరువేలు మాత్రమే. ఇందుకు కారణాలనేకం. తీసుకోవాలని  తెలియనివారు కొందరు కాగా.. తెలిసినా దాన్నిపొందేందుకు జీహెచ్‌ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగలేక, దరఖాస్తులోని వివరాలు భర్తీ చేసి, అవసరమైన ధ్రువీకరణలు అందజేయలేక ఎంతోమంది నిరాసక్తత కనబరుస్తున్నారు. ఈ పరిస్థితి నివారణతోపాటు .. జీహెచ్‌ఎంసీలో పెట్‌డాగ్స్‌ డేటాబేస్‌ కోసం..పెట్‌ లవర్స్‌కు ఎప్పటికప్పుడు యానిమల్‌ వెల్ఫేర్‌బోర్డు నుంచి అందే సూచనలు, సలహాలు తెలియజేసేందుకు, నిర్ణీత వ్యవధుల్లో యాంటీర్యాబిస్‌ వ్యాక్సిన్‌ వేయించేలా అలర్ట్‌ చేసేందుకు, ఇతరత్రా విధాలుగా వినియోగించుకునేందుకు ఆన్‌లైన్‌ డేటా అవసరమని జీహెచ్‌ఎంసీ భావించింది. చదవండి: ‘పెట్‌’.. బహుపరాక్‌!

దాంతోపాటు లైసెన్సుల కోసం ప్రజలు కార్యాలయాల దాకా రానవసరం లేకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్‌ ద్వారానే పెట్‌డాగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునేందుకు, ప్రతియేటా రెన్యూవల్స్‌కు ఆన్‌లైన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తే లైసెన్సు జారీ అవుతుంది. టోకెన్‌ కోసం మాత్రం ఒక్కసారి కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. లైసెన్సు పొందిన ప్రతికుక్కకూ యూనిక్‌ఐడీ ఉంటుంది. అది జీవితకాలం పనిచేస్తుంది. ప్రతియేటా లైసెన్సు రెన్యూవల్, ఇతరత్రా అవసరమైన సందర్భాల్లో ఐడీ ఉంటే చాలు.  చదవండి: పాపం: ఇరుకింట్లో 164 కుక్కలు

► జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లోని సంబంధిత లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు పరిశీలించాక లైసెన్స్‌ ఇస్తారు. దాంట్లో జీహెచ్‌ఎంసీ జోన్, లైసెన్సు నెంబర్, తదితర వివరాలుంటాయి.   
► దరఖాస్తులో యజమాని వివరాలతోపాటు కుక్క పేరు, ఆడ/మగ, రంగు, బ్రీడ్‌ ఆఫ్‌ డాగ్, ఐడెంటిఫికేషన్‌ మార్క్స్, వయసు, వ్యాక్సిన్‌ వేయించిన తేదీ, రెన్యూవల్స్‌కు టోకెన్‌ నంబర్‌ను భర్తీ చేయాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్‌లో అప్లై చేసేముందు కావాల్సినవి.. 
► మొబైల్‌ నెంబర్‌ u ఇటీవలి వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కాపీ  
► ఇరుగుపొరుగు ఇద్దరి నుంచి ఎన్‌ఓసీ 
► నివాస ధ్రువీకరణకు (విద్యుత్‌ బిల్‌/వాటర్‌బిల్‌/హౌస్‌ ట్యాక్స్‌ బిల్‌/ఆధార్‌/డ్రైవింగ్‌ లైసెన్స్‌) కాపీ. 
► ఆన్‌లైన్‌లో రూ.50 చెల్లించాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top