GHMC: Proposals Construction of New Railway Bridges, 3 RUB, 6 ROBs - Sakshi
Sakshi News home page

GHMC: హైదరాబాద్‌ సిటీలో సాఫీ జర్నీకి సై

Feb 16 2022 3:56 PM | Updated on Feb 16 2022 4:39 PM

GHMC Proposals Construction of New Railway Bridges, 3 RUB, 6 ROBs - Sakshi

రైల్వే మార్గాలున్న ప్రాంతాల్లో ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మిస్తే చిక్కులు తగ్గుతాయని భావించారు.

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ నగరంలో ట్రాఫిక్‌ చిక్కులు లేని ప్రయాణాల కోసం ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్‌డీపీ) ద్వారా పలు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి వంటి పనులు చేస్తున్న జీహెచ్‌ఎంసీ ఆయా ప్రాంతాల్లో రైలు ఓవర్‌ బ్రిడ్జీలు (ఆర్‌ఓబీలు), రైలు అండర్‌ బ్రిడ్జీలు (ఆర్‌యూబీలు) కూడా నిర్మించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఇప్పటికే పురోగతిలో ఉన్న డజనుకుపైగా ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలతోపాటు కొత్తగా మరో మూడు ఆర్‌యూబీలు, ఆరు ఆర్‌ఓబీలు నిర్మించాలని భావిస్తోంది. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఆయా ప్రాంతాల్లో ఎదురవుతున్న ట్రాఫిక్‌ చిక్కుల్ని తగ్గించేందుకు సదరు ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం ట్రాఫిక్‌ సర్వే పనులు జరుగుతున్నాయి.  

ట్రాఫిక్‌ చిక్కుల్లేకుండా..
నగరంలో ట్రాఫిక్‌ చిక్కుల్లేని ప్రయాణాల కోసమే రూ.25వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వం ఎస్సార్‌డీపీ ద్వారా ఫ్లై ఓవర్లు, తదితర పనులకు శ్రీకారం చుట్టింది. ఆ పనులన్నీ పూర్తయ్యేలోగా ప్రధాన మార్గాల్లో ఎదురవుతున్న చిక్కుల్ని పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలుగా మంత్రి కేటీఆర్‌ ఆలోచనతో లింక్, స్లిప్‌ రోడ్ల నిర్మాణాలు ప్రారంభించారు. వాటితో మంచి ప్రయోజనం కలగడంతో శివారు స్థానికసంస్థల పరిధిలో సైతం లింక్, స్లిప్‌రోడ్లకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించనున్నారు.

మరోవైపు రైల్వే మార్గాలున్న ప్రాంతాల్లో ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మిస్తే చిక్కులు తగ్గుతాయని భావించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాటిని విస్తరించాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్‌ రామ్‌గోపాల్‌పేట్‌ వంటి ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన విస్తరించాలని సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్‌ సూచించారు.

ఇటీవల రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌.. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా, ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా జీహెచ్‌ఎంసీ, రైల్వే అధికారులు సమన్వయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వాటితోపాటు ఇరుగ్గా ఉన్న ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలను విస్తరించాలని కోరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు వీటిని త్వరితగతిన చేపట్టేందుకు అవసరమైన చర్యల్లో తలమునకలయ్యారు. (క్లిక్‌: చార్మినార్ వద్ద బయట పడ్డ భూగర్భ మెట్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement