ఆశావహులకు బీజేపీ ఎర.. కాంగ్రెస్‌ దూకుడు!

GHMC Elections 2020: Opposition Parties Ready For Polling - Sakshi

సాక్షి, కూకట్‌పల్లి: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో పోటీపడే నాయకుల్లో టెన్షన్‌ మొదలైంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ కూకట్‌పల్లి నియోజకవర్గంలో రెండు, మూడు చోట్ల తప్ప మిగిలిన వాటిల్లో పాతవారికే అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. డైలమాలో ఉన్న ఆ సీట్లను కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీజేపీ విషయానికి వస్తే ఇప్పటికే కొత్త కొత్త నాయకులు పార్టీలో చేరుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలాబలాలను బేరీజు వేసుకొని బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తుండగా కొన్ని డివిజన్‌లలో ఆర్థికబలం ఉన్నవారు, ముందుస్తుగా అగ్రనాయకులను సంప్రదించి మద్దతు కోసం యత్నాలు చేస్తున్నారు. చదవండి:బల్దియా పోరు; అభ్యర్థులూ తస్మాత్‌ జాగ్రత్త!  

కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు సీట్లలో ఆర్థికంగా, ఉన్న నలుగురు అభ్యర్థులు ఇప్పటికే బీజేపీ అధిష్ఠానాన్ని సంప్రదించగా వారికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది.  కేపీహెచ్‌బీ డివిజన్‌లో పోటీ చేసే అభ్యర్థి, బలహీనంగా ఉన్న అభ్యర్థులకు సహాయ సహకారాలు అందించే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలాజీనగర్‌ డివిజన్‌లో కూడా పవన్‌ కల్యాణ్‌ సన్నిహితంగా ఉండే ఓ సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడి మేనకోడలు పేరును అధిష్ఠానం వద్ద ప్రతిపాదించగా ఆమె ఫైనల్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బోయినపల్లిలో మాజీ వైస్‌ చైర్మన్‌ తనయుడిని బీజేపీ నుంచి నిలబెట్టేందుకు అధిష్ఠానం ఆలోచిస్తోంది. టీఆర్‌ఎస్‌ ఉద్యమ నాయకుడిగా పనిచేసిన ఆయనను నిరాశ పరచడంతో బీజేపీ నుంచి బరిలో దింపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. 

కూకట్‌పల్లి డివిజన్‌లో కూడా టీఆర్‌ఎస్‌ నగర పార్టీ మాజీ అధ్యక్షుడు సుదర్శన్‌రావు బంధువులైన ఓ వ్యక్తికి టికెట్‌ కేటాయించేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లిలో ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసి ఆశలు పెట్టుకున్న నాయకులు, కొత్త చుట్టాలు రంగంలోకి రావటంతో డోలాయమానంలో పడిపోయారు. కొన్ని చోట్ల అసంతృప్తి సెగలు రేగే అవకాశం కూడా కన్పిస్తోంది. మరికొన్ని చోట్ల స్వతంత్య్ర అభ్యర్థులుగా కూడా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారు. జేపీ టికెట్ల విషయంలో కొత్త, పాత నాయకుల మధ్య మనస్పర్థాలు వచ్చే అవకాశం పుష్కలంగా కన్పిస్తోంది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న ప్రతి నాయకుడు మొదటగా డివిజన్‌కు పోటీ చేయాలని సూచించటంతో ఆ పార్టీలో పోటీ చేసేందుకు ముందుకురాని నాయకులే ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. ఎంపీ పట్టుపట్టి ఓ నలుగురైదుగురిని డివిజన్లు కేటాయించినా వారు ఇప్పటికీ కార్యాచరణ మొదలు పెట్టకపోవటం గమనార్హం. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించే వారిలో అంత పలుకుబడి లేకపోవడంతో ఈ సారీ  టీఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యర్థిగా బీజేపీ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిలను నియమించింది. అదేవిధంగా ఎన్నికల కమిటీలను సైతం ప్రకటించింది. మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఐదుగురు చొప్పున, రెండు పార్లమెంట్లకు ఆరుగురు సభ్యుల చొప్పున ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేసింది. మరోవైపు ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్రచార కమిటీని సైతం ప్రకటించింది. బుధవారం సాయంత్రంలోగా అభ్యర్థులను ప్రకటించి గురువారం అభ్యర్థులకు బీ ఫామ్‌ అందజేయనుంది. 21న కాంగ్రెస్‌ జీహెచ్‌ఎంసీ మేనిఫెస్టోను ఆ పార్టీ ఏఐసీసీ ఇన్‌చార్జి, ఎంపీ మాణిక్యం ఠాకూర్‌ విడుదల చేయనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top