
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు తిరుమలరావును ఎట్టకేలకు గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో ఎప్పటి నుంచో వివాహేతర బంధంలో ఉన్న తిరుమలరావు.. ప్లాన్ ప్రకారమే తేజేశ్వర్‌ను హత్య చేయించినట్లు అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. సర్వేయర్ హత్య కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య(సహస్ర), ఆమె తల్లి సుజాతతో పాటు హత్య చేసిన సుపారీ గ్యాంగ్ సభ్యులు ముగ్గురు, వీళ్లకు సహకరించిన మరో ముగ్గురు నిందితులు ఉన్నారు. అయితే కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ ఉద్యోగి అయిన తిరుమలరావు మాత్రం పరారీలో ఉన్నాడు. దీంతో.. అతన్ని గాలించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో హైదరాబాద్‌లోనే అతన్ని గద్వాల్ పోలీసులు అదుపులోకి తీసుట్లు సమాచారం. ప్రస్తుతం అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. సుపారీ గ్యాంగ్‌తో పోలీసులు ఈ ఉదయం సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేనసిట్లు తెలుస్తోంది.
ఏం జరిగిందంటే..
జోగులాంబ గద్వాలకు చెందిన లైసెన్స్ సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్ రావుతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమనే అభియోగాలు ఉన్నాయి. పోలీసుల విచారణలో.. విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తేజేశ్వర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్‌ను నమ్మించింది.
దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్‌రావు కోసం భర్త తేజేశ్వర్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్‌ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివారు పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్‌టాప్‌ను కృష్ణానదిలో పడేశారు.

ఈ ఘటన తర్వాత ఐశ్వర్యతో కలిసి లడాఖ్ పారిపోవాలని తిరుమలరావు స్కెచ్ వేశారు. ఘటనకు ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. ఆపై హత్య జరిగిన మరుసటి రోజు ఘటనా స్థలానికి వెళ్లి.. తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి వచ్చాడు. సుపారీ గ్యాంగ్‌కు రూ.2 లక్షలు ఇచ్చాడు. అయితే తిరుమలరావుకు ఎనిమిదేళ్ల కిందటే వివాహం అయ్యింది. ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో ఐశ్వర్యతో అయినా పిల్లల్ని కనాలని తిరుమలరావు భావించారు. ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేసినప్పటికీ.. బంధువుల నుంచి చెడు పేరు వస్తుందన్న భయంతో ఆ ఆలోచనను అమలు చేయకుండా వదిలేశాడు.
ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమలరావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తిరుమలరావును క్షణ్ణంగా విచారిస్తే.. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.