సాయుధ పోరాట యోధుడు జైని మల్లయ్యగుప్తా అంత్యక్రియలు పూర్తి

Freedom Fighter Jaini mallaiah gupta Funeral Completed At Hyderabad - Sakshi

అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు    

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటవీరుడు జైని మల్లయ్యగుప్తా(97) బుధవారంరాత్రి కన్నుమూశారు. కొద్దికాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మల్లయ్యగుప్తా హైదరాబాద్‌ నాగోల్‌లోని తన కుమారుడు మధుసూదన్‌ ఇంట్లో తుదిశ్వాస విడిచారు. అనంతరం భౌతికకాయాన్ని బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లోని పెద్ద కుమారుడి ఇంటికి తరలించారు.

మల్లయ్యగుప్తా సతీమణి సునంద 10 ఏళ్ల క్రితమే మరణించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన జైని మల్లయ్యగుప్తా 1945లో తెలంగాణ సాయుధపోరాటంలో కమ్యూనిస్టు నేత ఆరుట్ల రాంచంద్రారెడ్డి దళంలో పనిచేశారు. మల్లయ్య గుప్తా 1942లో క్విట్‌ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముంబైకి వెళ్లారు. నిజాం రాచరిక వ్యవస్థ, దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రముఖ కమ్యూనిస్టు నేత రావి నారాయణరెడ్డి నేతృత్వంలో సాగిన మహోద్యమంలో మల్లయ్యగుప్తా పాల్గొన్నారు.

1946 అక్టోబర్‌లో నిజాం ప్రభుత్వం మల్లయ్యతోపాటు పలువురిని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించింది. అయితే 1948లో జైలు నుంచి ఆయన చాకచక్యంగా తప్పించుకొని అజ్ఞాతంలో ఉండి పోరాటం కొనసాగించారు. ఆయనను పట్టించినవారికి ఇనాం ఇస్తామని కూడా ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఆ తరువాత పోరాటకాలంలో రావినారాయణ రెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలాదేవి తదితరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు. 1942లో భువనగిరి పురపాలక సంఘానికి మల్లయ్య గుప్తా తొలి వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. మొదటి నుంచి ఆయనకు సాహిత్యం, గ్రంథాలయోద్యమంపట్ల మక్కువ ఎక్కువ. అనేక గ్రంథాలయాల ఏర్పాటుకు ఆయన తోడ్పాటు అందించారు.  

పలువురు ప్రముఖుల సంతాపం 
జైని మల్లయ్యగుప్తా భౌతికకాయాన్ని ప్రొఫెసర్‌ హరగోపాల్, ప్రముఖ పాత్రికేయులు కె. శ్రీనివాస్, పాశం యాదగిరి, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, ఎస్వీ సత్యనారాయణ, సీపీఎం నేత ఎం.శ్రీనివాస్‌ సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులు అంబర్‌పేట శ్మశాన వాటికలో మల్లయ్యగుప్తా అంత్యక్రియలు నిర్వహించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top