తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు.. ఉచిత విద్యుత్, గ్యాస్‌ సబ్సిడీ? | Free Power And Gas Subsidy For New Ration Card Holders In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు.. ఉచిత విద్యుత్, గ్యాస్‌ సబ్సిడీ?

Jul 23 2025 12:38 PM | Updated on Jul 23 2025 12:57 PM

Free Power And Gas Subsidy For New Ration Card Holders In Telangana

దరఖాస్తుల కోసం కార్డులదారుల ఉరుకులు.. పరుగులు 

కలెక్టరేట్, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద కిటకిట 

ప్రజాపాలనలో దరఖాస్తులు చేసి ఉంటేనే నమోదుకు అవకాశం

సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా రేషన్‌ కార్డులు మంజూరైన పేద కుటుంబాలు ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలవుతున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కు వంట గ్యాస్‌ సిలిండర్‌ వర్తింపు కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. వారం రోజులుగా కలెక్టరేట్, మున్సిపల్‌ కార్యాలయాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాలకు దరఖాస్తుదారుల తాకిడి పెరిగింది. ఏడాదిన్నర క్రితం ప్రజాపాలన కార్యక్రమంలో విద్యుత్, గ్యాస్‌ కోసం ఆర్జీలు పెట్టుకున్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తేనే కొత్త దరఖాస్తులు నమోదవుతున్నాయి. అప్పట్లో దరఖాస్తు చేసుకోనివారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో గంటలకొద్దీ క్యూలో నిలబడి వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

అర్హత సాధించిన 58,565 కుటుంబాలు  
గ్రేటర్‌ పరిధిలో కొత్త రేషన్‌ కార్డుల మంజూరుతో సుమారు 58,565 కుటుంబాలు ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించినట్లయింది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 43,115, రంగారెడ్డి జిల్లాలో 8,680, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 6,770 కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి. దీంతో ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. సగానికి పైగా కుటుంబాలు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోకపోవడంతో ఆన్‌లైన్‌లో నమోదుకు సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ప్రజాపాలన దరఖాస్తు నంబర్‌తో ముడిపడి ఉంటడంతో నమోదుకు ఆటంకం కలుగుతోంది.

వాస్తవంగా ఇప్పటికే తెల్ల రేషన్‌కార్డు ప్రామాణికంగా అర్హత సాధించిన కుటుంబాలు సైతం కేవలం ఉచిత విద్యుత్‌కు  పరిమితమయ్యాయి. సిలిండర్‌పై సబ్సిడీ అందిస్తున్నా.. మెజార్టీ బీపీఎల్‌ కుటుంబాలకు వర్తించడం లేదు. బీపీఎల్‌ ఒకే కుటుంబం గృహాలక్ష్మి పథకానికి అర్హత సాధించినా.. మహాలక్ష్మి పథకానికి మాత్రం అర్హత సాధించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో పూర్తిస్థాయి బహిరంగ మార్కెట్‌ ధర చెల్లించి వంట గ్యాస్‌ సిలిండర్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.  

అందని ద్రాక్షగానే.. 
మహా నగర పరిధిలో వంట గ్యాస్‌ కనెక్షన్లు సుమారు 31.18 లక్షలు ఉండగా అందులో కొందరికి మాత్రమే రూ.500కు సబ్సిడీ వంట గ్యాస్‌ వర్తిస్తోంది. వాస్తవంగా సుమారు 24.74 లక్షల కుటుంబాలు మహాలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో సుమారు 19.01 లక్షల కుటుంబాలు మాత్రమే తెల్లరేషన్‌ కార్డులు కలిగి ఉన్నాయి. అయితే.. సబ్సిడీ గ్యాస్‌ మాత్రం మూడు లక్షల లోపు కనెక్షన్‌దారులు మాత్రమే ఎంపికైనట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే.. మిగతా సుమారు 16 లక్షల కనెక్షన్‌దారులు అర్హులుగా ఉన్నా.. సబ్సిడీ వర్తింపు మాత్రం అందని ద్రాక్షగా తయారైంది. కాగా.. సుమారు 52,65,129 గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, అందులో ప్రజాపాలనలో గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్‌ కోసం 24 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 11 లక్షల కుటుంబాలు జీరో బిల్లుకు అర్హత సాధించాయి. మిగతా కుటుంబాలు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement