చేపా.. చేపా ఎందుకు వదల్లే? ‘కాంట్రాక్టు’ అడ్డమొచ్చింది

Free Fish Distribution Program Implementation Problems In Telangana - Sakshi

సవ్యంగా సాగని ఉచిత చేప పిల్లల పంపిణీ  

ప్రొటోకాల్‌ పద్ధతి, రాజకీయ జోక్యంతోనూ ఇబ్బందులు 

సకాలంలో చేప, రొయ్య పిల్లల్ని చెరువుల్లో వదల్లేని పరిస్థితి 

ప్రస్తుత ప్రక్రియతోనే చేపపిల్లల ద్వారా జీఎస్‌డీపీ వృద్ధి రెండింతలు 

మత్స్యకార సొసైటీలకు అప్పగిస్తే మరింత ప్రయోజనమనే చర్చ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా మత్స్యసంపద పెరుగుతున్నప్పటికీ ఈ కార్యక్రమం అమల్లో ఎదురవుతున్న సమస్యలు విమర్శలకు తావిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వందలకోట్ల రూ పాయలు ఖర్చు పెట్టి జలవనరుల్లో ప్రభుత్వం చేపలు, రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ ఈ ప్రక్రియలో అవలంబిస్తోన్న పద్ధతుల పై పలు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమై ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు సకా లంలో జలవనరుల్లో చేప పిల్లలను వదల్లేకపోతు న్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

లోపభూయిష్టంగా కాంట్రాక్టు విధానం.. 
వాస్తవంగా జలవనరుల్లోకి జూన్, జూలై నెలల్లోనే చేపలు, రొయ్యల పిల్లలు వదలాల్సి ఉంటుంది. అప్పుడే సమయానుకూలంగా అవి పెరిగి పెద్దవయి ఆరోగ్యకరమైన మత్స్య సంపదను సృష్టిస్తాయి. కానీ, మత్స్య శాఖ అవలంబిస్తోన్న కాంట్రా క్టు విధానంతో చెరువుల్లో చేప పిల్లల్ని పోయడం ఆలస్యమవుతోంది. మత్స్యకార సొసైటీల ద్వారా పోసినప్పుడు ఇబ్బందులు రాలేదు కానీ, ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవస్థను తీసుకురావడంతో ఆలస్యం జరుగుతోంది.

కాంట్రాక్టుల ఖరారులో ఆలస్యం, కాంట్రాక్టర్లు పేచీలు పెట్టడం, విత్తనాల ధరల నిర్ణయంలో రాజకీయ జోక్యం అనివార్యం కావడం, కాంట్రాక్టర్లు ఈ విషయంలో ఆందోళనకు దిగడంతో టెండర్‌ను రద్దు చేయడం వరకు పరిణామాలు వెళ్లాయంటే ఈ కాంట్రాక్టు విధానం ఎంత లోపభూయిష్టంగా అమలవుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పూర్తయిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలను తెచ్చి చెరువుల్లో వదిలేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోతోంది. 

అభాసుపాలవుతున్న ప్రక్రియ
ఇక చెరువుల్లో వదిలే సమయంలో కూడా అనవసరమైన రాజకీయ ప్రమేయంతో జాప్యం జరుగుతోంది. ఫలానా చెరువులో చేపలు పోయాలంటే అక్కడి ప్రజాప్రతినిధులందరూ హాజరు కావాల్సి ఉండడం, ఒక్కరికి వీలు లేకపోయినా కార్యక్రమం వాయిదా వేయాల్సి రావడం లాంటి ప్రొటోకాల్‌ సమస్యలు లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని మత్స్యశాఖ అధికారులే చెబుతున్నారు.

మరోవైపు చేప విత్తనాలు పూర్తి స్థాయిలో ఏక కాలంలో అందుబాటులోకి రాకపోవడం, నాసిరకంగా ఉన్నాయని, పిల్లలు సరిగా లేవని, తక్కువగా వచ్చాయనే వివాదాలు కూడా ఈ ప్రక్రియను అభాసుపాలు చేస్తున్నాయి. అలాగే రాష్ట్ర చేపగా గుర్తింపు పొందిన కొర్రమీనును చెరువుల్లో పోసేందుకు మత్స్యశాఖ ఇప్పటివరకు ఉపక్రమించకపోవడం విమర్శలకు కారణమవుతోంది. 

నిబంధనల మేరకు సాగని లెక్క
వాస్తవానికి చేప పిల్లలను లెక్కపెట్టి మరీ చెరువుల్లో పోయాలి. ఈ లెక్క పెట్టిన చేప పిల్లలను రెవెన్యూ అధికారులు నిర్ధారించాలి. కెమెరాల మధ్య ఈ కార్యక్రమం జరగాలి. కానీ, అలా జరగడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. చేప పిల్లల లెక్కింపులో జరిగిన అవకతవకల కారణంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు క్షేత్రస్థాయి అధికారులపై ప్రభుత్వం అధికారికంగా అభియోగా లు నమోదు చేసి విచారణ జరుపుతోంది.

కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల వారితో పాటు రాజకీయ నాయకులు ఆర్థిక ప్రయోజనం గురించి ఆలోచిస్తున్నారే తప్ప మత్స్యకారుల సంక్షేమం కోసం ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మత్స్య సొసైటీలకే పూర్తిస్థాయిలో చేప పిల్లలను పోసే కార్యక్రమాన్ని అప్పగించడంతో పాటు మత్స్య శాఖ కచ్చితమైన పర్యవేక్షణతో ఈ సమస్యల్ని అధిగమిస్తే ప్రయోజనం ఉంటుందని, మత్స్య సంపద  పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఉచిత పంపిణీతో సత్ఫలితాలు 
మత్స్యకారుల ఆర్థిక స్వావలంబన పెంచే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమం అమల్లో ఎలాంటి సమస్యలున్నప్పటికీ చేప పిల్లల ఉచిత పంపిణీ సత్ఫలితాలనిస్తోందని గణాంకాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధిలో మత్స్య సంపద చెప్పుకోదగిన పాత్ర పోషిస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో చేపల పెంపకం, ఆక్వాకల్చర్‌ జీఎస్‌డీపీ భాగస్వామ్యం రూ. 2,670 కోట్లు ఉండగా, ఆ తర్వాత ఏడాది నుంచి వరుసగా రూ.2,649 కోట్లు, రూ.2,275 కోట్లు, రూ.3,654 కోట్లు, రూ.4,042 కోట్లు, రూ.4,694 కోట్లు, రూ.5,254 కోట్లుగా నమోదు కావడం గమనార్హం. 2016–17లో ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభం కాగా, 2017–18లో రొయ్య పిల్లల పంపిణీ ప్రారంభించారు.

మత్స్యకారుల కంటే కాంట్రాక్టర్‌కే ఎక్కువ లబ్ధి  
ప్రభుత్వం విడుదల చేసే చేప పిల్లల్లో కేవలం రెండు మూడు రకాలు మాత్రమే ఉంటున్నాయి. అదే మత్స్యకార సొసైటీలకు నిధులు ఇస్తే పది రకాల చేపలను వదిలే అవకాశం ఉంటుంది. చేపలు పోసే అధికారం కాంట్రాక్టర్‌కు ఉండడంతో నాసిరకం చేపలను వదులుతున్నాడు. అదే సమయంలో ఎక్కువ రేటు కావాలని డిమాండ్‌ చేస్తున్నాడు. ఈ పథకంలో వాస్తవంగా మత్స్యకారుల కంటే కాంట్రాక్టరే ఎక్కువ లబ్ధి పొందుతున్నాడు. – కాశమేని దేవేందర్, మత్స్యకారుడు, సిరిసిల్ల  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top