టెండర్లకే టెండర్‌ పెట్టారు | Sakshi
Sakshi News home page

టెండర్లకే టెండర్‌ పెట్టారు

Published Thu, Mar 16 2023 2:08 AM

Fraud in tender process - Sakshi

ఎక్కడైనా ఏవైనా పనులు చేపట్టాలంటే ముందుగా ఎంత ఖర్చవుతుందని అంచనా (ఎస్టిమేషన్‌) వేసుకోవాలి...  
♦  ఆ తర్వాత ప్రభుత్వం నుంచి పరిపాలనాపరమైన అనుమతులు తీసుకోవాలి. 
 అటు తర్వాత అంచనాకు అనుగుణంగా  టెండర్లను ఆహ్వానించాలి. 
 ఈ మేరకు నిర్దేశిత తేదీతో టెండర్‌ నోటిఫికేషన్‌ వేయాలి. 
దాఖలైన టెండర్లను పరిశీలించి కాంట్రాక్ట్‌ సంస్థను ఖరారు చేయాలి. 
 అనంతరం వారితో ఒప్పందం కుదుర్చుకోవాలి. అప్పుడు పనులు మొదలెట్టాలి 
 ఆ తర్వాత దశల వారీగా బిల్లులు చెల్లించుకుంటూ పోవాలి. 

ఏమిటీ నమ్మశక్యంగా లేదా.... అయితే  ఒక్కసారి ఈ ఫొటో చూడండి..
ఇది వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని మర్రికుంట చెరువు. పైన చెప్పిన నిబంధనలేవీ పాటించకుండానే,టెండర్లు పిలవకుండానే దీన్ని ట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి చేయడంతోపాటు సుందరీకరణ పనులు కొనసాగించేస్తున్నారు. ఇలా అభివృద్ధి పనుల పేరిట నిబంధనలకు నీళ్లొదిలి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దోపిడీ పర్వానికి తెరలేపిన తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 

ఎక్కడైనా.. ఏ ఊళ్లో అయినా ఇదే లెక్క.. అయితే వనపర్తి జిల్లాలోని మంత్రి ఇలాకాలో మాత్రం లెక్క వేరేగా ఉంటుంది. 
 ముందుగానే పనులు చేపడతారు.  
పనులు పూర్తయ్యే దశలో అంచనాలు రూపొందిస్తారు. 
 ఆ తర్వాత ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులుపొందుతారు. పోటీ లేకుండా గుట్టుచప్పుడు కాకుండాటెండర్‌ ప్రక్రియ ముగిస్తారు.  
 ♦ బిల్లులు చేయించి.. డబ్బులు తీసేసుకుంటారు. 

‘బినామీ’ కాంట్రాక్టర్లు..?
నిబంధనల ప్రకారం ఒక్కోవర్క్‌ రూ.5 లక్షల వరకు అయితే నామినేషన్‌ పద్ధతిన కేటాయింపులు చేయాలి. అంతకంటే మించి అయితే టెండర్‌ పద్ధతిన కాంట్రాక్ట్‌లు అప్పగించాలి. కానీ వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన నాలుగు చెరువుల సుందరీకరణకు సంబంధించి ఒక్కో దానికి సుమారు రూ.30 లక్షలకు పైబడి వ్యయమవుతుందని అంచనా.

ఈ మేరకు టెండర్‌ తప్పనిసరి కాగా.. పిలిస్తే పోటీ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చినట్లు తెలుస్తోంది. లోలోపల టెండర్‌ దక్కించుకున్న  ప్రముఖ కాంట్రాక్టర్లు  అధికార పారీ్టకి చెందిన నాయకులేనని తెలుస్తోంది. వీరంతా ఓ ముఖ్య నేతకు ప్రధాన అనుచరులుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. 

నోరు మెదపని అధికారులు.. 
ప్రభుత్వం నుంచి అనుమతులు రాకుండానే పనులు ప్రారంభించడం.. పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్, పంచాయతీరాజ్, అటవీ, మున్సిపల్‌ అధికారులు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యనేత ఆదేశాల నేపథ్యంలో వారు నిబంధనలకు నీళ్లు వదిలినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పనులు పూర్తయి న క్రమంలో వ్యయానికి మించి అంచనాలు రూపొందించి.. ఎక్కువ మొత్తంలో దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇది లక్షి్మకుంట. 20వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో కూడిన ఈ చెరువు సుందరీకరణ పనులు 2021లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సుమారు ఎనిమిది నెలల అనంతరం రూ.31.75 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2022 సెప్టెంబర్‌లో పరిపాలనా అనుమతులు రాగా.. గత నెల 14న రూ.29.59 లక్షలు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో పనులు కొనసాగగా.. అటవీ శాఖ కు సంబంధించి కంపా నిధులు వెచ్చించారు. 

ఇది రాజనగరం చెరువు. ట్యాంక్‌ బండ్‌ నిర్మాణంతో పాటు సుందరీకరణ పనులు గత ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. సుమారు రూ.49 లక్షల వ్యయంతో అదే ఏడాది ఫిబ్రవరిలో ఎస్టిమేషన్‌ (అంచనా) వేయగా.. అదే నెలలో పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. మార్చిలో కాంట్రాక్ట్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోగా.. జూన్‌లో కొంత మేర బిల్లులు మంజూరయ్యాయి. 

2021 ఆగస్టులో తాళ్లచెరువు సుందరీకరణ పనులు ప్రారంభం కాగా..గత ఏడాది ఫిబ్రవరిలో అంచనా వేసి ప్రభుత్వానికి పంపించారు.అనుమతులు రాగా.. మార్చిలో టెండర్‌ ప్రక్రియ పూర్తయి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత జూన్‌లో బిల్లులు మంజూరయ్యాయి. 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement