
కోరుట్ల: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. హైదరాబాద్‌లో ఇద్దరు, జగిత్యాల జిల్లాలో ఇద్దరు మరణించగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. కోరుట్ల–మెట్‌పల్లి జాతీయ రహదారి వెంట ఉన్న బాలాజీ కళా ఆర్ట్స్‌లో గణపతి విగ్రహాలు తయారు చేస్తారు. షెడ్‌లో తయారు చేసిన ఓ గణపతి విగ్రహానికి రంగులు వేసేందుకు మరో షెడ్‌కు తరలించడానికి ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో క్రేన్‌తో ఏర్పాట్లు చేసుకున్నారు.
యజమాని అల్వాల వినోద్, ఆయన తమ్ముడు అల్వాల నితిన్ 8 మంది వర్కర్లతో కలిసి విగ్రహాన్ని ట్రాలీపై జాతీయ రహదారిపైకి తెచ్చారు. విగ్రహం దాదాపు 12 ఫీట్ల ఎత్తు ఉండటంతో కిరీటం భాగం పైన ఉన్న 33 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. విగ్రహం తడిగా ఉండటంతో విగ్రహాన్ని పట్టుకుని ఉన్న పది మంది విద్యుత్ షాక్‌కు గురయ్యారు. కరెంట్ తీగల్లో మంటలు చెలరేగి విగ్రహం కిరీటం కాలిపోయింది.
ఏడుగురు షాక్‌తో విగ్రహానికి అతుక్కుపోయారు. మరో ముగ్గురు కింద పడిపోయారు. గమనించిన చుట్టుపక్కల వారు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు వారు కరెంటు తీగలను పక్కకు తప్పించారు. బాధితులను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో యజమాని అల్వాల వినోద్ (32), వర్కర్ వెల్లుట్ల సాయికుమార్ (23) మృతిచెందారు. ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలాన్ని ఎస్పీ అశోక్‌కుమార్ సందర్శించారు.
నిద్రలోనే తెల్లారిన బతుకులు
నాగోలు: నిద్రిస్తున్న వారిపై విద్యుత్ తీగలు తెగిపడిపోవ డంతో ఇద్దరు సజీవ దహనమైన ఘటన హైదరాబాద్ ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎల్‌బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఎల్‌బీనగర్‌లోని సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తా సమీపంలోని బాబాయ్ హోటల్ సమీపంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఫుట్‌పాత్‌పై ఇద్దరు గుర్తు తెలియ ని యాచకులు నిద్రిస్తున్నారు. వారితోపాటు ఓ శునకం కూడా ఉంది. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహ నం విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో 11 కేవీ హైటెన్షన్ వైరు తెగి నిద్రిస్తున్న వారిపై పడింది.
ఇద్దరు యాచకులతోపాటు పక్కనే ఉన్న శునకం సజీవ దహనమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్ధితి పరిశీ లించారు. 11కేవీ విద్యుత్ తీగ వారిపై పడిపోవడంతో మంటల్లో కాలిపోయి వారి బట్టలు, దుప్పట్లు వారి శరీరాలకు అంటుకున్నాయి. గుర్తించలేని విధంగా మృతదేహాలున్నాయి. మృతులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.