సీఎం బామ్మర్దిది రూ.15 వేల కోట్ల కుంభకోణం | Former Minister KTR allegation against Srujan Reddy | Sakshi
Sakshi News home page

సీఎం బామ్మర్దిది రూ.15 వేల కోట్ల కుంభకోణం

Jun 5 2026 4:38 AM | Updated on Jun 5 2026 4:38 AM

Former Minister KTR allegation against Srujan Reddy

మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపణ

బొగ్గు స్కాం బయటపెట్టామని మాపై కక్ష

బాల్క సుమన్‌తో జైల్లో ములాఖత్‌

చంచల్‌గూడ: సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డి రూ.15 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఆయన గురువారం చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం జైలు బయట మీడియాతో కేటీఆర్‌ మాట్లాడుతూ సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపెట్టినందుకే బీఆర్‌ఎస్‌ నాయకులపై ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. సోలార్‌ టెండర్ల అంశం, నైనీ బొగ్గు టెండర్ల అవకతవకలను మాజీమంత్రి హరీశ్‌రావు వెలుగులోకి తెచ్చారని చెప్పారు.

సింగరేణిలో ఉద్యోగ నియామకాలపై విజిలెన్స్‌ విచారణ చేపిస్తామన్న భట్టి విక్రమార్క వ్యాఖ్యలతో కార్మికులు కలత చెందారన్నారు. కుంభకోణాలను కప్పిపుచ్చేందుకే సుమన్‌ను జైల్లో పెట్టారని చెప్పారు. బాంబులు పెట్టి సీఎం అధికారిక భవనం ప్రగతి భవన్‌ను లేపేస్తామని గతంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ కూడా పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామన్నారని, అది కూడా శిక్షార్హమేనన్నారు. 

హరీశ్‌రావుపై పెట్రోల్‌ పోసి తగులబెడతానని మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశా­రు. ఇతరులకో న్యాయం, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకో న్యాయం జరుగు­తుందన్నారు. ఉద్యమ సమయంలో సుమన్‌పై 220 కేసులు పెట్టారని, ఇప్పుడు ఇంకా అక్రమ కేసులు పెట్టి రికార్డు బ్రేక్‌ చేసేలా ఉన్నారని చెప్పారు. తీయని 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గును తీసినట్టు అవకతవకలకు పాల్పడి రూ.1,600 కోట్ల గోల్‌మాల్‌కు తెరలేపారన్నారు. కేటీఆర్‌ వెంట ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌యాదవ్, సుధీర్‌రెడ్డి ఉన్నారు.

పాతబస్తీలో సందడి చేసిన కేటీఆర్‌..
చార్మినార్‌ (హైదరాబాద్‌): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ గురువారం పాతబస్తీలో పర్యటించారు. చంచల్‌గూడ జైల్లో తమ పార్టీ నాయకుడు బాల్క సుమన్‌ను పరామర్శించిన అనంతరం ఆయన నేరుగా చార్మినార్‌ వద్దకు చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుడు అలీ మస్కతీ తదితరులతో కలిసి అక్కడి నిమ్రా కేఫ్‌లో ఉస్మానియా బిస్కెట్లు తిని ఇరానీ చాయ్‌ తాగారు. తర్వాత ఆయన చార్మినార్‌ వద్ద పర్యాటకులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘హైదరాబాద్‌ పాతబస్తీకి వెళ్లినప్పుడు అక్కడి ఇరానీ చాయ్‌ తాగకపోతే ఆ పర్యటనకు సంపూర్ణత్వమే ఉండదు. చార్మినార్‌ పక్కనే ఉన్న నిమ్రా కేఫ్‌ను సందర్శించి, ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ చాయ్‌ని ఆస్వాదించాను’అని పేర్కొన్నారు. తమకు ఎంతో ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చినందుకు కేఫ్‌ సిబ్బందికి కేటీఆర్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement