రేవంత్‌కు బేసిన్ల కంటే బ్యాగుల మీదే నాలెడ్జి ఎక్కువ | Former Minister Harish Rao comments over Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌కు బేసిన్ల కంటే బ్యాగుల మీదే నాలెడ్జి ఎక్కువ

Jun 20 2025 2:35 AM | Updated on Jun 20 2025 5:46 AM

Former Minister Harish Rao comments over Revanth Reddy

నదుల బేసిన్లపై కనీస అవగాహన లేకుండా మాట్లాడారు

బనకచర్ల ప్రాజెక్టు ఏ నది బేసిన్‌లో కడుతున్నారో తెలియకపోతే ఎలా? 

మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం

ఏపీ జలదోపిడీ, అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవడం చేతకాక అబద్ధాలు చెబుతున్నారు

తెలంగాణ హక్కులను ఏపీకి, చంద్రబాబుకు రాసిస్తే ప్రజలు ఊరుకోరు

సాక్షి, హైదరాబాద్‌: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నదుల బేసిన్‌ల గురించి బేసిక్‌ నాలెడ్జ్‌ (కనీస అవగాహన) లేకుండా మాట్లాడారు. బేసిన్‌ (పరివాహక ప్రాంతం)ల కంటే కూడా బ్యాగుల మీదే నాలెడ్జి బాగా ఉన్నట్లు ఉంది. నదీ పరివాహాక ప్రదేశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటూ రాష్ట్రం పరువు తీశారు..’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గోదావరి–బనకచర్లపై ఏపీ ప్రభుత్వం గత ఆరు నెలలుగా కేంద్ర మంత్రులను కలుస్తూ అనుమతులు కోరుతుంటే, కనీసం ఆ ప్రాజెక్టు ఏ నది బేసిన్‌లో కడుతున్నారో కూడా సీఎం రేవంత్‌రెడ్డి తెలుసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

‘రేవంత్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారు. అంతులేని అజ్ఞానంతో మూర్తీభవించిన మూర్ఖత్వంతో మాట్లాడారు. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో తెలియదు. బనకచర్ల ఏ బేసిన్‌లో కడుతున్నారో తెలియదు. ఇవేవీ తెలుసుకోకుండా సీఎం ఏం చేస్తున్నట్లు..?’ అంటూ మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి రాజకీయాలా?
‘తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌కు అవగాహన, చిత్తశుద్ధి లేదని బుధవారం ఆయన ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో తేలిపోయింది. నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా బనకచర్ల ప్రకాశం జిల్లాలో ఉందని చెప్పడం విడ్డూరంగా ఉంది. బనకచర్ల విషయంలో మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ అప్రమత్తం చేస్తే, సీఎం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. 

ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో.. ‘ఈ భేటీని రాజకీయ వేదికగా మార్చకు..బనకచర్ల ఆపాలి’ అని మా రవిచంద్ర అంటే సీఎం అబద్ధాలకు వేదికగా మార్చారు. ఏపీ జలదోపిడీ, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం చేతకాని సీఎం చెప్తున్న అబద్ధాలకు అంతు ఉండటం లేదు. రేవంత్‌రెడ్డి కుసంస్కారి.. వదరుబోతు. ఆయన నల్లమల పులిబిడ్డ కాదు..వెకిలి మాటల వెర్రిబిడ్డ. మేం ఉద్యమాల నుంచి వచ్చినం. నీలాగా అడ్డమైన తొక్కులు తొక్కుతూ రాలేదు..’ అంటూ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఏపీకి రేవంత్‌ దాసోహం అవుతున్నారు..
‘గోదావరిలో 1,000, కృష్ణా నదిలో 500 టీఎంసీలు తెలంగాణకు తీసుకుని, మిగిలిన జలాలను ఏపీకి తరలించుకునేందుకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. తెలంగాణ ఆయన జాగీరు కాదు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద బతకడాన్ని రేవంత్‌ మానుకోలేక పోతున్నారు. ఏపీకి దాసోహం అవుతూ బనకచర్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. రేవంత్‌ చేసిన ద్రోహానికి ఆయనను ఉరి తీసినా తప్పులేదు.  

నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఏపీకి, చంద్రబాబుకు రాసిస్తే ప్రజలు ఊరుకోరు. చంద్రబాబుకు రేవంత్‌కు మధ్య ఆదిత్యనాథ్‌ దాస్‌ అనుసంధాన కర్తగా పనిచేస్తున్నాడు. గోదావరి, కృష్ణా జలాలు ఏపీకి దోచి పెట్టేందుకు అవి రేవంత్‌ అయ్య సొమ్ము కాదు. ఆయన కేవలం తెలంగాణకు కాపలాదారు మాత్రమే..’ అని మాజీమంత్రి అన్నారు. 

మేం అంగీకరించామనడం శుద్ధ అబద్ధం
‘తెలంగాణకు సాగునీటి కోసం పరితపించిన కేసీఆర్‌ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన నీటి వాటా కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. పోలవరం ద్వారా పెన్నా బేసిన్‌కు నీరు తరలిస్తే కృష్ణా బేసిన్‌లో 763 టీఎంసీలు తెలంగాణకు రావాలని గతంలో అఫిడవిట్‌ ఫైల్‌ చేశాం. గోదావరిలో సగటున ఏటా 3 వేలకు పైగా టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని సీడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా కేసీఆర్‌ అంచనా వేసి అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో ప్రస్తావించారు. 

కానీ రేవంత్‌రెడ్డి వాస్తవాలను వక్రీకరించి బనకచర్లకు గత ప్రభుత్వం అంగీకరించినట్లు అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణను సంప్రదించకుండా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేపడితే అంగీకరించేది లేదని గతంలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో కేసీఆర్‌ కుండబద్ధలు కొట్టారు. కానీ రేవంత్‌ మాత్రం 1,000 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చి, మీరు ఎన్ని జలాలు అయినా తరలించుకోండి అని ఏపీకి చెప్తున్నారు..’ అని హరీశ్‌రావు ఆరోపించారు.

ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం..
‘కృష్ణా–గోదావరి నదీ జలాల అనుసంధానం గురించి కేసీఆర్‌ చేసిన ప్రతిపాదనకు గతంలో ఏపీ సీఎం జగన్‌ అంగీకరించక పోవడంతో అది ముందుకు సాగలేదు. తెలంగాణతో సంబంధం లేకుండా కృష్ణా–గోదావరి అనుసంధానికి అంగీకరించే ప్రసక్తే లేదు. గోదావరి జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం. అవసరమైతే రైతుల పక్షాన కోర్టులను ఆశ్రయిస్తాం..’ అని హరీశ్‌రావు ప్రకటించారు. 

మీడియా సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, అనిల్‌ జాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement