breaking news
River basin
-
రేవంత్‌కు బేసిన్ల కంటే బ్యాగుల మీదే నాలెడ్జి ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నదుల బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ (కనీస అవగాహన) లేకుండా మాట్లాడారు. బేసిన్ (పరివాహక ప్రాంతం)ల కంటే కూడా బ్యాగుల మీదే నాలెడ్జి బాగా ఉన్నట్లు ఉంది. నదీ పరివాహాక ప్రదేశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటూ రాష్ట్రం పరువు తీశారు..’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గోదావరి–బనకచర్లపై ఏపీ ప్రభుత్వం గత ఆరు నెలలుగా కేంద్ర మంత్రులను కలుస్తూ అనుమతులు కోరుతుంటే, కనీసం ఆ ప్రాజెక్టు ఏ నది బేసిన్లో కడుతున్నారో కూడా సీఎం రేవంత్‌రెడ్డి తెలుసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.‘రేవంత్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారు. అంతులేని అజ్ఞానంతో మూర్తీభవించిన మూర్ఖత్వంతో మాట్లాడారు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియదు. బనకచర్ల ఏ బేసిన్లో కడుతున్నారో తెలియదు. ఇవేవీ తెలుసుకోకుండా సీఎం ఏం చేస్తున్నట్లు..?’ అంటూ మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి రాజకీయాలా?‘తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌కు అవగాహన, చిత్తశుద్ధి లేదని బుధవారం ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో తేలిపోయింది. నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ కూడా బనకచర్ల ప్రకాశం జిల్లాలో ఉందని చెప్పడం విడ్డూరంగా ఉంది. బనకచర్ల విషయంలో మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అప్రమత్తం చేస్తే, సీఎం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో.. ‘ఈ భేటీని రాజకీయ వేదికగా మార్చకు..బనకచర్ల ఆపాలి’ అని మా రవిచంద్ర అంటే సీఎం అబద్ధాలకు వేదికగా మార్చారు. ఏపీ జలదోపిడీ, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం చేతకాని సీఎం చెప్తున్న అబద్ధాలకు అంతు ఉండటం లేదు. రేవంత్‌రెడ్డి కుసంస్కారి.. వదరుబోతు. ఆయన నల్లమల పులిబిడ్డ కాదు..వెకిలి మాటల వెర్రిబిడ్డ. మేం ఉద్యమాల నుంచి వచ్చినం. నీలాగా అడ్డమైన తొక్కులు తొక్కుతూ రాలేదు..’ అంటూ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి రేవంత్ దాసోహం అవుతున్నారు..‘గోదావరిలో 1,000, కృష్ణా నదిలో 500 టీఎంసీలు తెలంగాణకు తీసుకుని, మిగిలిన జలాలను ఏపీకి తరలించుకునేందుకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ ఆయన జాగీరు కాదు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద బతకడాన్ని రేవంత్ మానుకోలేక పోతున్నారు. ఏపీకి దాసోహం అవుతూ బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రేవంత్ చేసిన ద్రోహానికి ఆయనను ఉరి తీసినా తప్పులేదు. నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఏపీకి, చంద్రబాబుకు రాసిస్తే ప్రజలు ఊరుకోరు. చంద్రబాబుకు రేవంత్‌కు మధ్య ఆదిత్యనాథ్ దాస్ అనుసంధాన కర్తగా పనిచేస్తున్నాడు. గోదావరి, కృష్ణా జలాలు ఏపీకి దోచి పెట్టేందుకు అవి రేవంత్ అయ్య సొమ్ము కాదు. ఆయన కేవలం తెలంగాణకు కాపలాదారు మాత్రమే..’ అని మాజీమంత్రి అన్నారు. మేం అంగీకరించామనడం శుద్ధ అబద్ధం‘తెలంగాణకు సాగునీటి కోసం పరితపించిన కేసీఆర్ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన నీటి వాటా కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. పోలవరం ద్వారా పెన్నా బేసిన్‌కు నీరు తరలిస్తే కృష్ణా బేసిన్లో 763 టీఎంసీలు తెలంగాణకు రావాలని గతంలో అఫిడవిట్ ఫైల్ చేశాం. గోదావరిలో సగటున ఏటా 3 వేలకు పైగా టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని సీడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా కేసీఆర్ అంచనా వేసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ప్రస్తావించారు. కానీ రేవంత్‌రెడ్డి వాస్తవాలను వక్రీకరించి బనకచర్లకు గత ప్రభుత్వం అంగీకరించినట్లు అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణను సంప్రదించకుండా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేపడితే అంగీకరించేది లేదని గతంలోనే అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. కానీ రేవంత్ మాత్రం 1,000 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చి, మీరు ఎన్ని జలాలు అయినా తరలించుకోండి అని ఏపీకి చెప్తున్నారు..’ అని హరీశ్‌రావు ఆరోపించారు.ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం..‘కృష్ణా–గోదావరి నదీ జలాల అనుసంధానం గురించి కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు గతంలో ఏపీ సీఎం జగన్ అంగీకరించక పోవడంతో అది ముందుకు సాగలేదు. తెలంగాణతో సంబంధం లేకుండా కృష్ణా–గోదావరి అనుసంధానికి అంగీకరించే ప్రసక్తే లేదు. గోదావరి జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం. అవసరమైతే రైతుల పక్షాన కోర్టులను ఆశ్రయిస్తాం..’ అని హరీశ్‌రావు ప్రకటించారు. మీడియా సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, అనిల్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నదులపై పెత్తనం ఎవరిది?
మన సంవిధానం ప్రకారం కేంద్రంతోపాటు రాష్ట్రాలకు సమాన సార్వభౌమాధికారాలు ఉండాలని, కేంద్రీకృత పాలనాధికార కేంద్రం, పెద్దరికం ఉండరాదని పాఠాలు చెప్పుకుంటున్నాం. ఆచరణలో ఇది రానురాను అసాధ్యంగా మారుతున్నది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర అధికారాలు రక్షించాలని కోరుకున్నవారు, తరువాత కేంద్రంలో అధికారానికి రాగానే కేంద్రానికే ఎక్కువ అధికారాలుండాలని కోరుకోవడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు భారతీయ సంవిధానంలోని సమాఖ్య లక్షణానికి నదీ శాసనాల నుంచి సవాలు ఎదురవుతున్నది. కేంద్రం హడావుడిగా శాసనాలు చేస్తూ కూలంకషంగా రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. నదీ పరివాహక ప్రాంత నిర్వహణ బిల్లు 2019 ద్వారా 13 అంతర్రాష్ట్ర నదులకు పరివాహక ప్రాంత అథారిటీలు ఏర్పాటుచేసి, నదుల నీళ్లను శాస్త్రీయంగా ఆదాయ మార్గంగా వాడుకునే సదుద్దేశం ఉన్నట్టు ప్రకటిస్తున్నారు. రెండో బిల్లు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు 2019 ద్వారా వివాద పరిష్కార కమిటీ ఒకటి, ఆ తరువాత శాశ్వతంగా పరిష్కార న్యాయస్థానం ఒకటి ఏర్పాటు చేయదలచుకున్నారు. మూడో బిల్లు ఆనకట్టల భద్రతా బిల్లు 2019. ఈ మూడు బిల్లులు ప్రవేశపెట్టడం జరిగిపోయింది. ఎవరూ అధ్యయనం చేసినట్టు లేదు. బిల్లులను కూలం కషంగా అవగాహన చేసుకుని రాష్ట్రాల హక్కులకు ఏవైనా సవరణలు ప్రతిపాదించేందుకు ప్రతి రాష్ట్రంలో ఒక విభాగం ఉండాలి. లేకపోతే, ఈ బిల్లులన్నీ శాసనాలుగా మారిన తరువాత సవరించడం సాధ్యం కాకపోవచ్చు. కోర్టుల్లో సవాలు చేసే అవకాశం ఉన్నా ఎన్నేళ్లకు ఏవిధంగా తెములు తాయో తెలియదు కనుక ప్రయోజనం లేదు. కేంద్ర–రాష్ట్రాల మధ్య అధికారాలను పంచడానికి రాజ్యాంగం ఏడవ షెడ్యూలులో మూడు జాబితాలు రచించింది. నదుల నీటిని రాష్ట్రాల జాబితాలో చేర్చారు. అంతర్రాష్ట్ర నదుల విషయంలో వివాదాలు వచ్చినపుడు మాత్రం కేంద్రం శాసనాలు చేయడానికి వీలుగా దాన్ని కేంద్ర జాబితాలో చేర్చారు. నీటి సరఫరా, సేద్యపు నీరు, సేద్యపు కాలువలు, డ్రైనేజీ, ఆయకట్టు, నీటి నిలువ, జల విద్యుచ్ఛక్తి అంశాలను ఒకటో జాబితాలో చేర్చారు. అంటే అంతర్రాష్ట్ర నదీ జలాలు, నదీ లోయల అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణకు సంబంధించిన ప్రజాప్రయోజనాల కోసం పార్లమెంటు రూపొందించిన చట్టాలకు అనుగుణంగా అధికారాలను నిర్వహించాలి. ఆర్టికల్ 262 ప్రకారం అంతర్రాష్ట్రీయ నదీ జలాల వివాదాలు వినడానికి, ఫిర్యాదులు పరిష్కరించడానికి పార్లమెంటుకు చట్టం చేసే అధికారం ఉంది. ఈ అధికారాన్ని వినియోగించి పార్లమెంట్ రివర్ బోర్డుల చట్టం 1956, అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఈ రివర్ బోర్డులు నదుల సమగ్ర అభివృద్ధి కోసం కావలసిన సలహాలు ఇవ్వవలసి ఉంటుంది. దారుణం ఏమంటే ఇంతవరకు ఈ చట్టం అమలు చేయలేదు. ఇది నిర్జీవపత్రంగా మిగిలిపోయింది. రివర్ బోర్డులు లేవు. నదీ జలాల మీద ఇరు రాష్ట్రాల మధ్యనున్న జగడాలు పరిష్కరించడం సాధ్యమే కావడం లేదు. ట్రిబ్యునల్స్ అవార్డు (తీర్పు)లు ఇచ్చినప్పటికీ అవి అమలు కాకపోవడం, దానిపైన సుప్రీంకోర్టుకు రాష్ట్రాలు వెళ్లడం వల్ల వివాదాలు ముదురుతున్నాయే తప్ప పరిష్కారం కావడం లేదు. నదులమీద ఏ శాసనం చేయాలన్నా రాష్ట్రాలతో సమగ్రంగా సంప్రదించాలని జాతీయ రాజ్యాంగ సమీక్షా కమిషన్ సిఫార్సు చేసింది. నదులు పారే రాష్ట్రాలకు ఆ నదులను రక్షించే బాధ్యత, నదీజలాలను సక్రమంగా వినియోగించి జాతి సంపద పెంచడానికి ప్రయత్నించే బాధ్యత ఉంటాయి. సమాఖ్య లక్షణాలను, రాష్ట్ర కేంద్ర సంబంధాలను సమీక్షించిన సర్కారియా కమిషన్ కూడా ఈ అంశాలనే ప్రస్తావించింది. రాష్ట్రం తనకు మరొక రాష్ట్రంతో వివాదం ఉందని కేంద్రం దృష్టికి తెచ్చిన తరువాత వివాదాన్ని గుర్తించడానికి విపరీత జాప్యం చేయడం, తరువాత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోవడం, ట్రిబ్యునల్ కాలాన్ని విపరీతంగా పెంచుతూ పోవడం, చివరకు అవార్డు వచ్చిన తరువాత కూడా దాని అమలుకు సాయపడకపోవడం సమస్యలుగా మారాయి. ఈ సమస్యల పరిష్కారం పేరుతో తెస్తున్న ఈ మూడు నదీ శాసనాలు ఎంతవరకు ఉపయోగపడతాయి. వీటిని తెచ్చే ముందు రాష్ట్రాలను ఎందుకు సంప్రదించలేదు. రాష్ట్రాల హక్కులను కాపాడుతున్నారా? నదుల మీద పెత్తనం ఎవరిది? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
20 వేల ఎకరాల్లో పంట నష్టం
ఖమ్మం వ్యవసాయం: గోదావరి ఉప్పొంగడంతో జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వీఆర్.పురం, కూనవరం, భద్రాచలం, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం, చర్ల, మణుగూరు, పినపాక, అశ్వాపురం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల పరిధిలోని 170 గ్రామాల్లో 20,867 ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీట మునిగినట్లు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు పి.బి.భాస్కర్ రావు తెలిపారు. 5,020 మంది రైతులకు చెందిన 11,077 ఎకరాల్లో పత్తి నీట మునిగిందని, ఇందులో అత్యధికంగా వేలేరుపాడు మండలంలో 2,600 ఎకరాలు ఉందని చెప్పారు. 3,310 మంది రైతులకు చెందిన 7,622 ఎకరాల్లో వరి పంట నీట మునిందన్నారు. ఇందులో పినపాక మండలంలో 2,300 ఎకరాలు, వెంకటాపురం మండలంలో 2,250 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నదని వివరించారు. 632 మంది రైతులకు చెందిన 2,130 ఎకరాల్లో మిర్చి నీట మునిగిందన్నారు. ఇంకా 30 ఎకరాల్లో మొక్కజొన్న, 68 ఎకరాల్లో వేసిన పప్పుదినుసుల పంటలకు నష్టం వాటిల్లిందని వివరించారు. ముందే వేసిన పంటలు.. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో మే, జూన్ నెలల్లో వర్షాలు కురియటంతో ముందుగానే పత్తి వేశారు. ఈ ప్రాంతంలో పత్తి దాదాపు పూత, కాత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మొక్క దశలోనే ఉంది. ఇప్పటికే ఈ పంటకు రైతులు ఎకరాకు రూ.12 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. నీట మునిగిన పంట కుళ్లి పోతుంది. వరదల తరువాత ఈ పంట ఎర్రబారి తెగుళ్లు సోకి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇటీవల వరి నాట్లు వేయగా, మరికొన్ని ప్రాంతాల్లో నెల రోజుల క్రితమే వేశారు. ప్రస్తుతం ఈ పంట కూడా నీట మునిగి, కుళ్లి పోయి పనికి రాకుండా పోతుందని, మొక్కజొన్న, కంది, పెసర, మినుము పంటలు కూడా నీట మునిగాయని రైతు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. నీట మునిగిన ప్రాంతాల ప్రజలకు సౌకర్యాలు కల్పించటంతో పాటు ఆయా శాఖల అధికారులు నష్టాలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఇలంబరితి ఆదేశించారు. దీంతో జేడీఏ పి.బి.భాస్కర్ రావు గోదావరి పరివాహక ప్రాంత మండలాల వ్యవసాయాధికారులకు నీట మునిగిన పంటలపై పలు సూచనలు చేశారు. వరదలు పూర్తిగా తగ్గితే కానీ నష్టం అంచనాలు వేయలేమని అధికారులు చెప్పారు. 50 శాతానికి పైగా నష్టం వాటిల్లిన పంటల వివరాలను సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.