
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షులు, న్యూస్ సర్వీస్ సిండికేట్(ఎన్ ఎన్ఎస్) మేనేజింగ్ డైరెక్టర్, మాజీ శాసనసభ్యులు కొండా లక్ష్మారెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. లక్ష్మారెడ్డి మృతి పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.
జర్నలిజంపై ఉన్న మక్కువతో 1980 దశకంలో న్యూస్ సర్వీస్ సిండికేట్ మీడియా సంస్థను ప్రారంభించి మీడియా రంగానికి సేవలందించిన కొండా లక్ష్మారెడ్డి మరణం మీడియా రంగానికి తీరని లోటని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పేర్కొన్నారు. పత్రికా రంగంలోనే కాకుండా చేవెళ్ల శాసనసభ్యునిగా రాజకీయరంగంలో కూడా సేవలందించారని తెలిపారు. పత్రికా రంగానికి లక్ష్మారెడ్డి అందించిన విశిష్ట సేవలు మరువలేనివని కొనియాడుతూ, ఆయన మృతికి సంతాపం,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.