తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్‌రెడ్డి కన్నుమూత 

First Generation Telangana Activist Sridhar Reddy Passed Away - Sakshi

1969 నాటి ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థి నేతగా పోరాటం

సాక్షి, హైదరాబాద్‌: తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, నాటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నేత ఎం.శ్రీధర్‌రెడ్డి (77) కన్నుమూశా రు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో శ్రీధర్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 

విద్యార్థి నేతగా ఉద్యమంలోకి.. 
1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాడారు. ఆ సమయంలో యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఉన్న శ్రీధర్‌రెడ్డి.. ఉవ్వెత్తున ఉద్యమాన్ని రేపి, ముందుండి నడిపించారు. అప్పట్లో మర్రి చెన్నారెడ్డి ఏర్పాటు చేసిన సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి (ఎస్‌టీపీఎస్‌)కు పోటీగా తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్‌)ని ఏర్పాటు చేశారు. జనతాపార్టీ ఆవిర్భావం తర్వాత అందులో చేరి ఆలిండియా యువ జనతా విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎన్‌.జనార్ధనరెడ్డి ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఏపీ స్పోర్ట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.  

ప్రముఖుల దిగ్భ్రాంతి.. 
శ్రీధర్‌రెడ్డి మృతి తీరని లోటు అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన నాయకత్వ లక్షణాలున్న గొప్ప నేత అని, ఆయన మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటు అని చెప్పారు. శ్రీధర్‌రెడ్డి మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, వీహెచ్, నిరంజన్, కోటూరి మానవతారాయ్‌ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీధర్‌రెడ్డి నిఖార్సయిన తెలంగాణ పోరాట యోధుడని.. ఆయన మరణం రాష్ట్రానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకు డిగా రాజీలేని పోరాటం చేసిన శ్రీధర్‌రెడ్డి మర ణం తెలంగాణకు తీరని లోటు అని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ పేర్కొన్నారు. 

విలువల కోసం కట్టుబడిన శ్రీధర్‌రెడ్డి: సీఎం తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్‌రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో శ్రీధర్‌రెడ్డి చేసిన కృషిని స్మరించుకున్నారు. 1969 నాటి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన శ్రీధర్‌రెడ్డి.. తాను నమ్మిన విలువలకు కట్టుబడి, రాజీపడకుండా పనిచేశారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.  శ్రీధర్‌రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మ¯Œ  వినోద్‌కుమార్‌ సంతాపం వ్యక్తం చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top