మునుగోడులో కాల్పుల కలకలం! అసలు కారణం ఇదేనా?

Firing Incident Munugode Mandal Singapuram - Sakshi

మునుగోడు, నార్కట్‌పల్లి:  వాటర్‌ బాటిల్స్‌ సరఫరా చేసే డీలర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ద్విచక్ర వాహనంపై వచ్చి దాడి చేసి వెంటనే పరారయ్యాడు. మూడు చోట్ల బుల్లెట్‌ గాయాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికంగా జరిగిన గొడవలే దీనికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 
(చదవండి: కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్‌.. మునుగోడు ఉపఎన్నికలో సామాజిక అస్త్రంగా!)

గోదాంకు వెళ్లి వస్తుండగా.. 
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల గ్రామానికి చెందిన నిమ్మల స్వామి కొన్నేళ్లపాటు ట్రాక్టర్‌ నడిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ వాటర్‌ బాటిల్‌ కంపెనీ డీలర్‌షిప్‌ తీసుకుని.. మునుగోడు, చండూరు మండలాలకు సరఫరా చేస్తున్నారు. మునుగోడులోని లక్ష్మిదేవిగూడెంలో ఉన్న తన గోదాముకు బ్రాహ్మణవెల్లెంల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. గురువారం రాత్రి ఆయన బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా.. సింగారం గ్రామ శివార్లలో మరో బైక్‌పై వచ్చి న దుండగులు పిస్టల్‌తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు.

స్వామి వెన్నెముక భాగంలో రెండు, కుడి అరచేతికి ఒక బుల్లెట్‌ తగిలి కిందపడిపోయారు. సమీపంలోని ఇళ్లవారు ఇది చూసి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యులు స్వామిని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా.. చిట్యాలకు చెందిన రేడియం స్టికర్స్‌ వేసే వ్యక్తి లేదా మునుగోడుకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు తనపై కాల్పులు జరిపి ఉంటారని స్వామి అనుమానం వ్యక్తం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
(చదవండి: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీలోకి కాంగ్రెస్‌ యువ నేత.. కండువా కప్పి ఆహ్వానించిన షర్మిల)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top