కాంగ్రెస్‌లోకి చెరుకు సుధాకర్‌.. మునుగోడు కోసమేనా? | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్‌.. మునుగోడు ఉపఎన్నికలో సామాజిక అస్త్రంగా!

Published Fri, Aug 5 2022 7:24 AM

Cheruku Sudhakar To Join Congress Munugode Politics - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి, పీడీ యాక్టు కింద జైలు జీవితం గడిపిన ఉద్యమకారుడు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపుతో ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన చెరుకు సుధాకర్‌.. గురువారం జాతీయ నేతలతో నాలుగు గంటలకుపైగా కాంగ్రెస్‌ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, తానూ కాంగ్రెస్‌ కండువా కప్పుకోవాలని చెరుకు సుధాకర్‌ నిర్ణయానికి వచ్చినట్టు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. 

మునుగోడు కోసమే! 
చెరుకు సుధాకర్‌ గౌడ్‌ను కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగానే చేర్చుకుంటుందన్న చర్చ మొదలైంది. నిజానికి ఆయన కాంగ్రెస్‌లో చేరడంపై గతంలోనూ చర్చలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నేపథ్యంలో.. బలహీన వర్గాల ప్రభావం ఎక్కువగా ఉన్న మునుగోడులో సామాజిక అస్త్రం కింద చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఎంచుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు నియోకవర్గంలో గౌడ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. లక్షకుపైగా ఇతర బీసీ సామాజిక వర్గాల ఓట్లు ఉన్నాయి. ఆ రెండు వర్గాలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ బీసీ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోందని అంటున్నారు.

మరోవైపు తెలంగాణ ఉద్యమకారుడిగా, సామాజిక దృక్పథం ఉన్న నేతగా చెరుకు సుధాకర్‌కు గుర్తింపు ఉంది. ఇది కూడా కలిసి వస్తుందని కాంగ్రెస్‌ భావిస్తున్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ రానున్న చెరుకు సుధాకర్‌.. నేరుగా చండూరులో జరిగే కాంగ్రెస్‌ మునుగోడు నియోజకవర్గ స్థాయి సమావేశానికి వెళ్లనుండటం గమనార్హం. మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక వస్తే బరిలో దింపేందుకు పార్టీ నేతలు పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్, పున్నా కైలాశ్‌ నేత, చెలిమల కృష్ణారెడ్డి పేర్లను కూడా కాంగ్రెస్‌ పరిశీలిస్తోంది.
చదవండి: పావులు కదుపుతున్న హస్తం నేతలు.. రేవంత్‌పై ఢిల్లీ పెద్దలు సీరియస్‌!

Advertisement
Advertisement