Gurukula Jobs 2022: గురుకుల పోస్టుల భర్తీ.. 9,096 కొలువులకు ప్రతిపాదనలు సిద్ధం

Finance Department Issued Approvals For 9096 Jobs In Four Gurukula Societies - Sakshi

గురుకుల పోస్టులకు రోస్టర్, రిజర్వేషన్లవారీగా ఇండెంట్లు రూపొందించిన సొసైటీలు

త్వరలో నియామకాల బోర్డుకు సమర్పణ.. ఆ తర్వాత విడతలవారీగా ప్రకటనలు

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో కొలువుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. నాలుగు గురుకుల సొసైటీల్లో 9,096 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేస్తూ నియామక బాధ్యతను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐ–ఆర్‌బీ)కు బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ ఖాళీలు, రోస్టర్‌ పాయింట్లు, రిజర్వేషన్లు తదితర పూర్తి సమాచారంతో కూడిన ప్రతిపాదనల (ఇండెంట్లు)ను సంక్షేమ గురుకుల సొసైటీలు తాజాగా తయారు చేశాయి.

ప్రతిపాదనల తయారీలో ప్రధానంగా నూతన జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగ కేటాయింపుల అంశం కాస్త జాప్యం కావడంతో ప్రతిపాదనల రూపకల్పన సైతం కాస్త పెండింగ్‌లో పడిపోయింది. తాజాగా జీఓ 317 ప్రకారం అన్ని గురుకుల సొసైటీల్లో ఉద్యోగ కేటాయింపులు పూర్తికాగా ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది. ఉద్యోగ కేటాయింపుల ప్రతిపాద నలకు ఆమోదం లభించిన వెంటనే ఉద్యోగులకు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయనున్న సొసై టీలు... వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలను బోర్డుకు సమర్పించే అవకాశం ఉంది.

బీసీ గురుకులాల్లో అత్యధిక ఖాళీలు...
ప్రస్తుతం గురుకుల కొలువుల్లో అత్యధికంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 9,096 పోస్టులకు అనుమతులు ఇవ్వగా వాటిలో మూడో వంతుకు పైబడిన ఖాళీలు మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)లో ఉన్నాయి.

ఆ తర్వాత స్థానంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలో 2,267 ఉద్యోగాలు, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో 1,514 కొలువులు, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్‌) పరిధిలో 1,445 ఉద్యోగ ఖాళీలున్నాయి. గురుకుల టీజీటీ పోస్టులకు టెట్‌ మెరిట్‌తో ముడిపడి ఉంది. ఈ క్రమంలో ఇటీవల టెట్‌ ఫలితాలు సైతం వెలువడటంతో ఆయా పోస్టుల నియామకాలకు మార్గం సుగమమైంది.

ఇక పీజీటీ, జేఎల్, డీఎల్‌ పోస్టులకు సంబంధించిన నిబంధనలు సైతం ఖరారయ్యాయి. ఈ క్రమంలో గురుకుల సొసైటీలు నియామక బోర్డుకు ఇండెంట్లు సమర్పించిన వెంటనే వాటిని దాదాపు పక్షం రోజుల్లో పరిశీలించి కేటగిరీలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని గురుకుల సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top