ముందుకొచ్చిన సల్మాన్‌ఖాన్, అజయ్‌దేవగన్
ఒక్కో స్టూడియోకు 50–60 ఎకరాల కేటాయింపు
త్వరలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఒప్పందాలు
సాక్షి, హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనుంది. ఐటీ, ఫార్మా, ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలతో పాటు విద్య, వైద్యం, వినోదం, పర్యాటక కేంద్రాలను కూడా ఫోర్త్ సిటీలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్ ఫ్యూచర్ సిటీలో బాలీవుడ్ స్టార్లు సల్మాన్‌కు చెందిన సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ (ఎస్‌కేఎఫ్), అజయ్ దేవగన్‌కు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ‘ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్ వాలా’ఫిల్మ్ స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి.
ఒక్కో స్టూడియో ఏర్పాటుకు 50–60 ఎకరాల స్థలం అవసరమని ఆయా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపారు. దీంతో స్థల కేటాయింపులతోపాటు ఇతరత్రా రాయితీలను సైతం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. వచ్చే నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025’లో ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది.
800 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ
రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడి కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలోని మీర్‌ఖాన్‌పేటలో వంద ఎకరాల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’2025’ను నిర్వహించనుంది. ఇప్పటికే ఫోర్త్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. దీంతోపాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 800 ఎకరాలను కేటాయించనున్నారు.
భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ సారథ్యంలో ఈ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుపై కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్‌కుమార్, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి, టీజీఐఐసీ ఎండీ, ఫ్యూచర్ సిటీ కమిషనర్ శశాంక ఆధ్వర్యంలో ఎంఓయూ చేసుకోనున్నారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి మైదానంతోపాటు ప్రపంచ క్రీడా పోటీలు ఇక్కడే జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
25 కీలక ప్రాజెక్టుల రోడ్ మ్యాప్స్
ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌గా ప్రభుత్వం వర్గీకరించింది. రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి గమ్యస్థానం ఇదేనని ప్రభుత్వం భావిస్తోంది. 2047 నాటికి రాష్ట్ర ఎకానమీని 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక పాలసీలు, మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రపంచ దిగ్గజ సంస్థలకు వివరిస్తారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్డు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీ వంటి 25 కీలక ప్రాజెక్టులు, పెట్ట్బుడి అవకాశాల రోడ్ మ్యాప్‌లను ప్రదర్శిస్తారు.
సందర్శకుల కోసం అదనంగా రెండు రోజులు
రెండు రోజుల ఈ గ్లోబల్ సమ్మిట్‌లో జీఎంఆర్ స్పోర్ట్స్, మెఘా వంటి పలు సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. సీఐఐ, క్రెడాయ్, నాస్కామ్ వంటి పరిశ్రమ సంఘాల నుంచి వంద మంది నిపుణులు, ప్రముఖులు, వక్తలు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. 8,9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ వేదిక సాధారణ ప్రజలు, విద్యార్థుల కోసం అదనంగా మరో రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్ట్‌లు వంటి కార్నివాల్ ఎక్స్‌పీరియన్స్ అందుబాటులోనే ఉంటుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది.


