తగ్గుతున్న సన్నబియ్యం ధరలు | Falling prices of fine rice | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న సన్నబియ్యం ధరలు

Aug 10 2025 5:20 AM | Updated on Aug 10 2025 5:20 AM

Falling prices of fine rice

రేషన్‌లో ఒకేసారి మూడు నెలల సన్నబియ్యం పంపిణీ ఫలితం  

మరోవైపు విదేశాలల్లోనూ భారీగా పెరిగిన విస్తీర్ణం, ఉత్పత్తి  

పొరుగు రాష్ట్రాల్లోనూ ధాన్యపు రాశులు 

గణనీయంగా తగ్గిన ఎగుమతులు.. 

మూతపడుతున్న హోల్‌సేల్‌ రైస్‌ డిపోలు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/నిజామాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. రేషన్‌కార్డు దారులకు మూడు నెలల కోటా కింద సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు సన్నధాన్యంపై రైతులకు బోనస్‌ ఇస్తుండడంతో విస్తీర్ణం పెరిగి వానాకాలం, యాసంగిలో భారీగా సన్నధాన్యం దిగుబడులు వచ్చాయి. ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 

మరోవైపు బియ్యం రీసైకిల్‌ దందా 90 శాతం పైగా తగ్గింది. ఇంకోవైపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో ధాన్యం దిగుబడి భారీగా పెరగడం... చైనా, థాయ్‌లాండ్, వియత్నాం తదితర దేశాల్లోనూ ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యింది. దీంతో రాష్ట్రం నుంచి ఏటా భారీగా బియ్యం ఎగుమతులు చేస్తున్న మిల్లర్లపై గట్టి ప్రభావమే పడింది. ఎగుమతులు తగ్గి రైస్‌మిల్లులోనూ నిల్వలు పేరుకుపోయాయి.

గతేడాదితో పోలిస్తే...
» 2024 అక్టోబర్‌కు ముందుతో పోలిస్తే బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు తగ్గాయి.  
» బీపీటీ–5204 పాత బియ్యం క్వింటా ధర గత ఏడాది రూ.5వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.4,400లకే అమ్ముతున్నారు. కొత్త బియ్యం విషయానికి వస్తే గత అక్టోబర్‌కు ముందు క్వింటా ధర రూ.4,100 ఉండగా...ఇప్పుడు రూ.3,800కు చేరింది.  
»  హెచ్‌ఎంటీ రకం పాత బియ్యం గతంలో క్వింటా రూ.6 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.5,600కు తగ్గింది. కొత్త బియ్యం క్వింటా రూ.5,600 ఉండగా ప్రస్తుతం రూ.5వేలకు తగ్గింది.  
»  జైశ్రీరాం రకం పాత బియ్యం గత అక్టోబర్‌కు ముందు క్వింటా రూ.7,600 ఉండగా, ప్రస్తుతం రూ.7,200కు తగ్గింది. జైశ్రీరాం కొత్త బియ్యం గతంలో క్వింటా రూ.7వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.6,400కు తగ్గడం గమనార్హం. రేషన్‌లో సన్నబియ్యం «సరఫరాతో హోల్‌సేల్‌ బియ్యం దుకాణాలు మూత పడుతున్నాయి, ఒక్క వరంగల్‌ ట్రైసిటీలో 5,500కు పైగా ఉన్న షాపులు జూన్, జూలై మాసాలలో 800 వరకు మూతపడినట్టు వ్యాపారులు చెబుతున్నారు.  

భారీగా తగ్గిన ఎగుమతులు.. 
రాష్ట్రం నుంచి బియ్యం దిగుమతి చేసుకునే దేశాల్లో సైతం ధాన్యం దిగుబడులు ఎక్కువగా వచ్చాయి. మరోవైపు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో సైతం ధాన్యం దిగుబడులు భారీగా వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ స్థాయిలో సీఎంఎఆర్‌ తీసుకోకపోవడంతోపాటు ధాన్యం రైతులకు బోనస్‌ చెల్లించే పథకం లేదు. రేషన్‌ దుకాణాల ద్వారా తెలంగాణ మాదిరిగా సన్నబియ్యం ఇవ్వడం లేదు. ఇక కర్ణాటకలో ప్రతి గింజను మిల్లర్లే కొనుగోలు చేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఇతర రాష్ట్రాలు ఇచ్చిన ధరకు.. తెలంగాణ మిల్లర్లు బియ్యం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. 

చాలా స్వల్పస్థాయిలో మాత్రమే మార్జిన్లు వస్తుండటంతో తమకు గిట్టుబాటు కావడంలేదని రాష్ట్రానికి చెందిన రైస్‌ మిల్లర్లు ఎగుమతులకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో రిటైల్‌ మార్కెట్‌లోనూ «బియ్యం ధరలు తగ్గాయి. ఇదిలా ఉండగా ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలవడం గమనార్హం. ఈ ఏడాది రాష్ట్రంలో 2కోట్ల 80లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. కేంద్ర నిల్వల కోసం 60 లక్షల మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. 50–60 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం మిగులుతున్నాయి.  

» తెలంగాణ నుంచి ఏటా 8 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి అవుతోంది. ఈ ఏడాది ధాన్యం సేకరణలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన నిజామాబాద్‌ జిల్లా నుంచి గత ఏడాది వరకు మిల్లర్లు సుమారు 25 వేల టన్నుల బియ్యం దుబాయి, చైనా, ఆ్రస్టేలియా, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాలకు ఎగుమతి చేసేవారు.  

» ధాన్యం భారీగా పండించే వరంగల్, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల నుంచి సైతం ప్రతి ఏటా సుమారు 80 వేల టన్నులకు పైగా బియ్యం ఎగుమతులు చేసేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎగుమతులు మూడో వంతుకు పడిపోయాయి.  

సన్నబియ్యంతో సగం దుకాణాలు మూతపడ్డాయి 
సర్కారు సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో హోల్‌సేల్‌ రైస్‌ దుకాణాల్లో ఒక్కసారిగా అమ్మకాలు తగ్గాయి. గతంలో ఒక్కోరోజు 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు అమ్మితే ఇప్పుడు రోజుకు రెండు, మూడు కూడ అమ్మడం లేదు. జూన్, జూలై మాసాల్లో అయితే ఒక్క బస్త కూడా అమ్మలేదు. వరంగల్‌ నగరంలో ఇప్పటికే చాలా హోల్‌సేల్‌ బియ్యం దుకాణాలు మూత పడ్డాయి.   – దేవసాని తిరుపతి, హోల్‌సేల్‌ బియ్యం వ్యాపారి, వరంగల్‌

ఎగుమతులు తగ్గించాం 
ఇతర రాష్ట్రాల్లో సన్న ధాన్యాన్ని బోనస్‌ లేదు. అక్కడ ప్రతి ధాన్యపు గింజను మిల్లర్లే కొనుగోలు చేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పలుకుతున్న ధరకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల మిల్లర్లు ఎగుమతులు చేస్తున్నా రు. తెలంగాణలో సన్నధాన్యం బోనస్‌ కారణంగా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో పలుకుతున్న ధరకు బియ్యం ఎగుమతి చేయలేకపోతున్నాం. ఎగుమతులు చాలావరకు తగ్గించాం.   – కాపర్తి శ్రవణ్, రైస్‌మిల్లర్, నిజామాబాద్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement