సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ల తయారీ ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. సదరు ముఠా టెన్త్, ఇంటర్, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం, ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వివరాల ప్రకారం.. నార్సింగిలో ఫేక్ సరిఫికెట్లు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అక్కడే మాటువేసిన పోలీసులు.. నెక్నాంపూర్ చింతచెట్టు వద్ద నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తుండగా ఓ ముఠాను పట్టుకున్నారు. సదరు ముఠా.. ఎస్ఆర్ఎం యూనివర్శిటీ, బెంగుళూరు సిటీ యూనివర్శిటీకి చెందిన ఫేక్ సరిఫికెట్లు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక, ఈ నకిలీ సర్టిఫికెట్లతో పాటు ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్స్, బోనాఫైడ్ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్.. కేవలం 50 వేలకు టెన్త్, 75 వేలకు ఇంటర్, 1.20 లక్షలకే డిగ్రీ సర్టిఫికెట్లను అమ్మకానికి పెట్టారు. గత కొంత కాలంగా నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తూ ఈ ముఠా సొమ్ము చేసుకుంటుంది.. ఒరిజినల్ సర్టిఫికెట్లు మాదిరిగా ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేశారు. అనంతరం, ఈ ముఠాను నార్సింగి పోలీసులకు అప్పగించడంతో.. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముఠా సభ్యులు వీరే..
A1.మీర్జా అక్తర్ అలీ బైగ్ @ అస్లాం – నకిలీ సర్టిఫికెట్ల ప్రధాన తయారీదారు
A2. మహ్మద్ అజాజ్ అహ్మద్ – డిమాండ్ సేకరణ మరియు సర్టిఫికెట్ల మధ్యవర్తి
A3.వడ్డేపల్లి వెంకట్ సాయి – నకిలీ డిగ్రీ కొనుగోలుదారు
A4.విస్టాలా రోహిత్ కుమార్ – నకిలీ సర్టిఫికెట్ల కొనుగోలుదారు
A5.సత్తూరి ప్రవీణ్ – నకిలీ బి.టెక్ సర్టిఫికెట్ కొనుగోలుదారు


