
క్రిప్టో కరెన్సీ మోసాలు నాకు అప్పగించారు.. టార్గెట్ చేరుకోలేదని జీతం తగ్గించారు
మయన్మార్ కేకే పార్క్ కేంద్రంగా సైబర్‌మోసాల తీరును వివరించిన ప్రత్యక్ష సాక్షి మహమ్మద్ అర్బాజ్ బిన్‌బా బేజర్
హైదరాబాద్‌కు తిరిగొచ్చిన తర్వాత టీజీసీఎస్‌బీలో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : ‘థాయ్‌లాండ్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం పేరిట నన్ను బ్యాంకాక్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి మయన్మార్‌లోని కేకేపార్క్ ప్రాంతంలోకి జాంటు అనే కంపెనీకి ఒక చైనీయుడు నన్ను తీసుకెళ్లాడు. అక్కడున్నవారు నన్ను సైబర్ మోసాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. తర్వాత వారే సైబర్ మోసాలు ఎలా చేయాలి? ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి? వారితో నమ్మకంగా ఎలా మెలగాలి? చివరకు ఎలా మోసగించాలి? ఇలా అన్నింటికి సంబంధించి శిక్షణ ఇచ్చారు.
తర్వాత నాకు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసాలు చేసే పని అప్పగించారు’ అంటూ మహమ్మద్ అర్బాజ్ బిన్‌బా బేజర్ తన ప్రత్యక్ష అనుభవాన్ని చెప్పారు. నగరానికి చెందిన మహమ్మద్ అర్బాజ్ బిన్‌బా బేజర్ ఉద్యోగం కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లి సైబర్ నేరగాళ్ల ముఠా చేతికి ఎలా చిక్కాడు..ఎలా బయటపడ్డారో టీజీ సైబర్‌సెక్యూరిటీ బ్యూరో అధికారులకు గురువారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏజెంట్ రూ.60,000 తీసుకొని...
ఫలక్‌నుమాలోని మీ సేవ కేంద్రంలో డేటాఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసే తనకు థాయ్‌లాండ్‌లో అదే ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ బషీర్ రూ. 60,000 తీసుకొని తనను 2025 జనవరి 1న బ్యాంకాక్ పంపినట్టు మహమ్మద్ అర్బాజ్ చెప్పాడు. ‘బ్యాంకాక్ విమానాశ్రయంలో ఒక చైనీయుడు నన్ను రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత ఒక ట్యాక్సీలో థాయ్‌లాండ్‌లోని మే సాట్‌లోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు.
ఆ తర్వాత అతను నన్ను మే సాట్‌లోని నది పాయింట్‌కు తీసుకెళ్లి, చిన్న పడవలో నదిని దాటించి మయన్మార్‌లోని మైవాడికి, ఆ తర్వాత కారులో కేకే పార్క్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ క్రిప్టోకరెన్సీలో పెట్టుబడుల పేరిట మోసాలు చేసే పని అప్పగించారు. ఆ ముఠావారు ముందు నకిలీ వివరాలతో ఒక ఫేస్‌బుక్ ఖాతా తెరిపిస్తారు. దానిలో పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టాలి.
స్పందించిన వ్యక్తులతో ఫొటోలు, శుభాకాంక్షలు పెడుతూ, వారి అభిరుచులు, అలవాట్లపై చర్చిస్తూ పరిచయం పెంచుకోవాలి. అలా వారి నమ్మకాన్ని పొందిన తర్వాత, టీమ్ లీడర్ మాకు నిజమైన యూఎస్ వాట్సాప్ నంబర్ ఇస్తాడు. వాట్సాప్‌లో సంభాషణను కొనసాగిస్తూ, చైనీయులు నిర్వహించే వెబ్‌సైట్ ద్వారా క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయని, నాకు కూడా మీరు పెట్టే పెట్టుబడిలో ఒక శాతం కమీషన్ అందుతుందని ఒప్పించాలి.
ఎదుటి వ్యక్తికి అనుమానం వస్తే వారి నమ్మకాన్ని తిరిగి పొందడానికి మేము వీడియో కాల్ చేస్తాం. ఇలా పెట్టుబడులు పెట్టించి మోసగించాలి. నేను ఇలా ఒకటిన్నర నెల పనిచేసిన తర్వాత, నాకు అప్పగించిన టార్గెట్ చేరుకోలేదని నా జీతం తగ్గించారు. భారత్‌తోపాటు ఎన్నో దేశాల వారు అక్కడ పనిచేస్తున్నారు. ఇటీవల మాలాంటి వారిని అక్కడి సైన్యం కాపాడుతున్నట్టు వార్తలు వచ్చాయి. అప్పుడు మా కంపెనీ వారు మమ్మల్ని పిలిచి..ఆసక్తి లేనివారు కంపెనీని విడిచి వెళ్లిపోవచ్చని చెప్పారు.
2025 ఫిబ్రవరి 23న సైన్యం మా కంపెనీ కార్యాలయానికి వచ్చింది. అప్పుడు నేను సైనిక బృందంతో భారత రాయబార కార్యాలయానికి వచ్చి, 2025 మార్చి 11న భారత్‌కు చేరుకున్నాను’ అని టీజీసీఎస్‌బీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు బషీర్, ఇతరులపై కేసు నమోదు చేసిన టీజీసీఎస్‌బీ డీఎస్పీ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment