టీచర్ల సీనియారిటీపై కసరత్తు | Exercise On Seniority Of Teachers In Telangana | Sakshi
Sakshi News home page

టీచర్ల సీనియారిటీపై కసరత్తు

Jun 25 2022 10:32 AM | Updated on Jun 25 2022 10:44 AM

Exercise On Seniority Of Teachers In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ఉన్నతాధికారులు మళ్లీ సమీక్ష ప్రారంభించారు. ముందుగా సీనియారిటీ జాబితా రూపకల్పనపై దృష్టి పెట్టారు. ముసాయిదా జాబితాను తయారు చేసి, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితా రూ పొందించే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు ఎంత మేర తీసుకోవాలి, సీనియారిటీకి ప్రామాణికాలు ఏమిటనే దానిపై సూచనలు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. విద్యా శాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై శుక్రవా రం చర్చించారు. ఆ తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. 

సీనియారిటీ జాబితా విడుదలకు ముందు బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత 317 జీవో వల్ల కొంతమంది టీచర్లు ఆయా జిల్లాలకు బదిలీ అయ్యారు. ఈ కారణంగా సర్వీసును ఎలా పరిగణనలోకి తీసుకోవాలనే అంశం అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రమోషన్ల ప్రక్రియకు గతం నుంచి పనిచేసిన సర్వీసును  పరిగణనలోకి తీసుకుని, బదిలీల విషయంలో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలనే ప్రతిపాదనపై అధికారు లు చర్చించారు. ఇప్పటికే స్పౌజ్‌ కేసులు, అనారోగ్యం కారణంగా బదిలీలు కోరుకునే వారు, పరస్పర బదిలీలు పెట్టుకున్నవారూ ఉన్నారు. వీటిని పరిష్కరించకుండా ముందుకెళ్లడం కష్టమని అధికారవర్గాలు భావిస్తున్నాయి.  

ఇది అన్యాయం 
‘దీర్ఘకాల వాధులతో బాధపడుతున్న టీచర్లు, విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న స్పౌజ్‌ కేసులు, వికలాంగులు, ఒంటరి మహి ళలు ఎన్ని విజ్ఞప్తులు చేసుకున్నా పట్టించుకోని ప్రభుత్వం.. రాజకీయ ప్రముఖుల పైరవీతో కొంతమందిని ఇష్టమొచ్చిన చోటుకు దొడ్డిదారిన బదిలీ చేయడం అన్యాయం.  సీనియారిటీ జాబితా లేకుండా బదిలీలు, పదోన్నతుల వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు.’  
–చావా రవి, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి 

దొడ్డిదారి బదిలీలు షురూ! 
బదిలీలు, పదోన్నతులపై కసరత్తు జరుగుతుండగానే.. కొంతమందిని కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు ఒకరిని మెడికల్‌ గ్రౌండ్‌లో బదిలీ చేశారు. మరో ఉపాధ్యాయుడిని ఎస్‌ఈసీఆర్‌టీకి డిప్యుటేషన్‌పై పం పారు. తాజాగా శుక్రవారం ఓ రాజకీయ ప్రముఖుడి కనుసన్నల్లో ఉన్న వ్యక్తిని నల్లగొండ నుంచి రంగారెడ్డికి బదిలీ చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 317 జీవోలో 28వ నిబంధనలో ప్రభుత్వం అవసరమనుకుంటే ఎవరినైనా, ఏ కారణం చూపకుండా ఇష్టమొచ్చిన చోటుకు బదిలీ చేయొచ్చు. దీన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది పైరవీకారులు నేరుగా సీఎం కార్యాలయం నుంచి దొడ్డిదారి బదిలీల కోసం ఒత్తిడి పెంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement