
సాక్షి, హైదరాబాద్: నగరంలో కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పడి వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా నడిపిస్తున్న కల్లు దుకాణాలపై ఎక్సైజ్ పోలీసులు నాజర్ పెట్టారు. కల్తీ కల్లు ఘటనలపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు.
శేరిలింగంపల్లి సిద్ధిక్ నగర్‌లో కల్లు కాంపౌండ్‌పై దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు.. అనుమతి లేకుండా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కల్లు కాంపౌండ్ సీజ్ చేయడంతో పాటు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. మూసాపేట్, బాలానగర్, కైతలాపూర్ ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించి కల్లు కాంపౌండ్‌లో ఉన్న పలు శాంపిల్స్ సేకరించారు. ముషీరాబాద్‌లో మూడు, కాచిగూడలో రెండు కల్లు డిపోలపై ఎక్సైజ్ తనిఖీలు చేపట్టారు.

కల్లు కాంపౌండ్లలో సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించిన ఎక్సైజ్ అధికారులు.. తనిఖీల సమయంలో కల్లు కాంపౌండ్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. డిపోల నుంచి వచ్చే కల్లును మాత్రమే స్టోరేజ్ చేసి విక్రయించాలన్నారు. కల్లులో ఎలాంటివి కలిపిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అల్ప్రోజలం లాంటివి మత్తు కోసం కలిపితే నేరమన్న పోలీసులు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఒక్కసారి ఇలాంటివి చేసి పట్టుపడితే పర్మినెంట్‌గా లైసెన్స్ రద్దు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.