‘హిల్ట్ పి’ అమలు నిర్ణయంపై పర్యావరణవేత్తలు, నిపుణులు
పారిశ్రామిక ప్రాంతాల్లో ఇప్పటికే భూగర్భ జలాలు, గాలి కలుషితం...
భూవినియోగ మార్పిడితో ఎదురయ్యే పెను సవాళ్లపై అంచనాలేమైనా ఉన్నాయా?
పర్యావరణ ప్రభావ అసెస్‌మెంట్ చేయకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు?
దశాబ్దాలుగా పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమై పోయిన భూగర్భ జలాలను ఎలా శుద్ధి చేస్తారని ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం (హిల్ట్ పి)– 2025పై పర్యావరణవేత్తలు, నిపుణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విధానం తీరుతెన్నులు, అమలు ప్రణాళికలపై వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని అమలు, భవిష్యత్తులో తలెత్తే పెనుసవాళ్లు, సమస్యల గురించి ప్రభుత్వానికి ఓ అంచనా, అవగాహన ఉందా అని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా భూగర్భ జలాలు కలుషితమై ఉండటాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇప్పటికే ప్రజా, ప్రభుత్వ అవసరాలకు హైదరాబాద్‌లో భూమి అందుబాటులో లేదని, కనీసం సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) పెట్టడానికి కూడా భూమి లేదంటూ.. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో ఎస్టీపీల ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నారు. ప్రజలు సురక్షితంగా జీవించడానికి అనుమైన పరిస్థితులు ఉండాలి కదా.. అంటున్నారు. ఒక అవసరం నుంచి మరో అవసరానికి బదలాయించడానికి భూమి అందుబాటులో ఉంటే అది ప్రస్తుత పరిస్థితులను మెరుగు పరచడానికి ఉపయోగపడుతుందా లేదా చూడాలి.. కానీ ఎలాంటి అంచనాలు, సమీక్ష లేకుండా అమలు చేయడం మంచిది కాదు.
భూమి బదలాయింపు అంటే అది ప్రైవేటీకరణ కిందకు వస్తుంది. ఈ భూముల్లో రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ కాంప్లెక్స్‌లు వెలుస్తాయి. ఇందుకోసం కొంత ఫీజు వసూలు చేస్తారు. కానీ హైదరాబాద్ మహానగరానికి మాత్రం తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉంది..’అని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ‘హిల్ట్ పి’పై పర్యావరణవేత్తలు, ప్రభుత్వ విధానాలు, నీటి వనరుల నిపుణులు తమ అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు.
ఓవరాల్ ప్లానింగ్ లేకుండా ఎలా?
పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను వేలం వేసినా, మార్పిడి చేసినా బ్రౌన్ డెవలప్‌మెంట్‌గా పరిగణిస్తారు. అసలు మాస్టర్‌ప్లాన్‌తో సంబంధం లేకుండా, మొత్తం ప్రాంతానికి ఓవరాల్ ప్లానింగ్ లేకుండా, డిజైన్ విత్ నేచర్ లేకుండా ఎలా చేస్తారు? సస్టెయినబులిటీ (సుస్థిరత), అఫర్డబిలిటీ (కొనుగోలు శక్తి)ని దృష్టిలో పెట్టుకుని గ్రీన్ డెవలప్‌మెంట్ జరగాలి. ఆయా ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా జీవించగలిగే పరిస్థితులు ఉండాలి. హైదరాబాద్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేదు. అధికారులు మారినప్పుడల్లా విధానాలు మారుతున్నాయి.
గతంలో తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం లేదు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పట్టణీకరణ విపరీతంగా పెరిగిపోనున్న నేపథ్యంలో..రాష్ట్ర ప్రభుత్వం అర్బనైజేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లోనూ రియల్‌గుడ్ ల్యాండ్ స్కేప్ డిజైనింగ్ చేయాలి. భవిష్యత్ సవాళ్లు, సమస్యలను అంచనావేసి వాటిని అధిగమించేలా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ చేస్తున్నది అసలు మాస్టర్‌ప్లానే కాదు. ఇవన్నీ సస్టెయినబుల్ బ్లూప్రింట్ పరిధిలోకి రావడం లేదు. – ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త
ప్రజల ఆరోగ్యం మాటేమిటి?
పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం ఉంది కాబట్టి జనావాసాలకు దూరంగా నగరం బయటకు తరలిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అంటే హైదరాబాద్ మహానగరం నలుమూలల కాలుష్యం ఉందని అంగీకరించినట్టే కదా. అలాంటి ప్రాంతాల్లో నివాస సముదాయాలకు అనుమతినిస్తే అక్కడి ప్రజల ఆరోగ్యం ఏమి కావాలి? అసలు ఆయా ప్రదేశాల్లో కాలుష్యం అనేది ఏయే రూపాల్లో విస్తరించింది? ప్రభావమెంత? రాబోయే రోజుల్లో ఎదురయ్యే దుష్పరిణామాలు ఏమిటి? తదితరాలపై పర్యావరణ ప్రభావ అంచనా (ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్) లాంటిది ఏదైనా చేశారా? దీనికి సంబంధించి శాస్త్రీయపరమైన అంచనాలు ఏమైనా ప్రభుత్వం వద్ద ఉన్నాయా? ఒక ప్రాంతంలో అకస్మాత్తుగా భూమి వినియోగం మారి రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై ఎన్నో రెట్లు ఒత్తిడి పెరిగితే ఆ సమస్యను ఎలా అధిగమిస్తారు? సవివరమైన ప్రణాళిక, అంచనాలు లేకుండా హడావుడిగా భూమి మార్పిడి చేయడం సరికాదు. ఈ నిర్ణయంతో సమస్యలు మరిన్ని రెట్లు పెరుగుతాయే తప్ప ప్రజలకు సౌలభ్యం ఉండదు. – డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, పబ్లిక్ పాలసీ నిపుణులు
ప్రత్యేక విధానం తేవాలి
భూమి, భూవనరుల వినియోగం, మార్పిడిపై తెలంగాణ ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. భూ వినియోగాన్ని మార్చడం కాకుండా ఈ భూమిని ముందుగా ప్రభుత్వం తీసుకోవాలి. అసలు ఈ మార్పిడి వలన ఎవరు ప్రయోజనం పొందుతున్నారనేది ప్రశ్న. పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్ (పీపీపీ) పేరిట ఎవరు ప్రయోజనం పొందుతున్నారనేది చర్చకు రావాలి.
ఇప్పుడు మార్పిడి చేస్తున్న ప్రాంతాలు కాలుష్యంతో కూడుకున్నవి. వాయు కాలుష్యాన్ని ఏదోరకంగా చక్కదిద్దవచ్చునేమో కానీ దశాబ్దాలుగా పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమై పోయిన భూగర్భ జలాలను ఎలా శుద్ధి చేస్తారు? నా అంచనా మేరకు మరో 50 ఏళ్ల దాకా ఎంత శ్రమ పడినా ఈ భూగర్భ జలాలు శుభ్రం కావు. ఈ విధంగా కలుషితమైన భూగర్భ జలాల్లో వేసే పునాదులు ఎన్నిరోజులు ఉంటాయో పరీక్షించిన రికార్డు ఏదైనా ఉందా? అసలు పరిశీలించారా? అవన్నీ కొన్నేళ్ల తర్వాత కుప్పకూలిపోతే పరిస్థితి ఏమిటీ? డిజాస్టర్ రిస్క్ అసెస్‌మెంట్ ఏమైనా చేశారా? – బీవీ సుబ్బారావు, వాటర్ ఎక్స్‌పర్ట్, కన్సల్టెంట్ ఇన్ వాటర్ రిసోర్సెస్ అండ్ క్లైమేట్ ఛేంజ్


