
ఆ తర్వాతే ఇంజనీరింగ్ కొత్త ఫీజుల ఖరారు
టీజీఏఎఫ్‌ఆర్‌సీ భేటీలో నిర్ణయం
ఏఎఫ్‌ఆర్‌సీ ఆడిటర్లు ప్రైవేటు కాలేజీల కొమ్ముగాశారనే ఆరోపణలపై ‘సాక్షి’ కథనం
‘సాక్షి’ కథనం వాస్తవమేనన్నవిద్యాశాఖ అధికారులు!
ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికీ వెళ్లిన వైనం
మరోసారి ఆడిట్ నివేదికలు పరిశీలించాలని, కాలేజీలకు వెళ్లాలని నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రైవేటు కాలేజీలతో ఎఫ్‌ఆరీసీ ఆడిటర్లు కుమ్మక్కయ్యారా? ఇతర అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే మరోసారి భేటీ అయ్యి ఫీజుల ఖరారు చేయాలని నిర్ణయించారు. 2025–26 నుంచి మూడేళ్ళ కాలానికి గాను, ఇంజనీరింగ్ కాలేజీల వార్షిక ఫీజుల పెంపుపై తుది నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (టీజీఏఎఫ్‌ఆర్‌సీ) మంగళవారం భేటీ అయింది. కమిటీ చైర్మన్ జస్టిస్ గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగిత రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన పలువురు అధికారులు పాల్గొన్నారు.
ప్రైవేటు కాలేజీలు ఇష్టానుసారం ఆడిట్ రిపోర్టులు సమర్పించాయని మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సమావేశంలో సీరియస్‌గా చర్చ జరిగింది. ‘సాక్షి’వార్తలో వాస్తవం ఉందనే అభిప్రాయం ఉన్నతాధికారులు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏఎఫ్‌ఆర్‌సీ నియమించిన ఆడిటర్లు ప్రైవేటు కాలేజీలకు కొమ్ముగాశారనే ఆరోపణల నేపథ్యంలో ఫీజుల పెంపును గుడ్డిగా ఆమోదించలేమని వారు స్పష్టం చేశారు. దీంతో ప్రైవేటు కాలేజీల జమా ఖర్చులపై ఆడిట్ నివేదికలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించింది.
కాలేజీల ఆడిట్ నివేదికలను ఆమోదించిన ఆడిటర్ల నిబద్ధతపై కమిటీలోని పలువురు సభ్యులు సందేహాలు లేవనెత్తినట్టు తెలిసింది. కాలేజీలతో వారికి గల సంబంధాలపై ఆరా తీయాలని విద్యాశాఖకు చెందిన కీలక అధికారి సూచించినట్టు సమాచారం. అడ్డగోలుగా ఫీజులు పెంచేందుకు వీలుగా ఆడిటర్లతో ప్రైవేటు కాలేజీలు కుమ్మక్కవ్వడం ప్రభుత్వాన్ని అప్రదిష్టకు గురి చేస్తుందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆడిటర్ల నేపథ్యం తెలుసుకోకుండా ఫీజులు పెంచేందుకు అనుమతించకూడదని ఆమె వ్యాఖ్యానించినట్టు సమాచారం.
సీఎంవోలోనూ అధికారుల చర్చలు!
ఏఎఫ్‌ఆర్‌సీ సమావేశం ఉదయం 11 గంటలకే జరగాల్సి ఉండగా మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగింది. ‘సాక్షి’కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఆరా తీసిందని, దీంతో సమావేశానికి రావాల్సిన అధికారులు సీఎంవోకు వెళ్ళి చర్చించినట్టు సమాచారం. అలాగే ఫీజులను ఇప్పటికిప్పుడు యథాతథంగా ఆమోదించవద్దనే సూచనలు అందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సమావేశం మొదలవ్వగానే విద్యాశాఖ అధికారులు ఫీజుల పెంపుపై తీవ్ర అభ్యంతరం లేవనెత్తినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘ప్రైవేటు కాలేజీలు ఇచ్చిన ఆడిట్ నివేదికలు పరిశీలించి నిర్ధారించుకున్నారా?’అంటూ ఓ ఉన్నతాధికారి ప్రశ్నించినట్టు తెలిసింది.
దీంతో ‘ఇది తమ పని కాదని, ఆడిట్ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటామన్నట్టుగా ఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు కొందరు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా ‘అసలు ఆడిటర్లు ఎవరు? వారికి గతంలో ఏయే కాలేజీలతో అనుబంధం ఉంది?’అనే అంశాలపై ఆరా తీయాలని విద్యాశాఖ అధికారులు పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో అధికారుల మధ్య వాడివేడి వాగ్వాదం జరిగిందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో రెండు ప్రైవేటు కాలేజీల ఆడిట్ రిపోర్టులను సమావేశానికి తె ప్పించిన విద్యాశాఖ అధికారులు అందులో లోపాలను ఎత్తిచూపినట్టు తెలిసింది.
అన్ని కాలేజీల ఆడిట్ రిపోర్టులూ ఇదే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైన నేప థ్యంలో ఆ నివేదికలు మరోసారి పరిశీలించాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్త కోర్సులు పెట్టామని, మౌలిక వసతుల కో సం భారీగా ఖర్చు పెట్టామంటూ.. నివేదిక లు ఇచ్చిన కాలేజీలకు స్వయంగా వెళ్ళి పరి శీలించాల్సిన అవసమూ ఉందని కొందరు అధికారులు వాదించినట్లు సమాచారం.
ఆడిటర్లపై సీఎంవో ఆరా
ఏఎఫ్‌ఆర్‌సీ నియమించిన ఆడిటర్లు ప్రైవేటు కాలేజీలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీఎంవో రంగంలోకి దిగింది. ఆడిటర్లకు సంబంధించిన వివరాలపై స్వయంగా వాకబు చేస్తోంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఆడిట్ నివేదికల కోసం నియమించుకున్న ఆడిట్ సంస్థలకు, ఏఎఫ్‌ఆర్‌సీ నియమించిన ఆడిటర్లకు మధ్య సబంధాలున్నట్టుగా సీఎంవోకు సైతం ఫిర్యాదులు వచి్చనట్టు తెలిసింది. ప్రైవేటు కాలేజీల ఆడిట్ నివేదికలు పరిశీలిస్తున్న క్రమంలో జరిగిన ఫోన్‌కాల్ సంభాషణలపై వాకబు చేస్తున్నట్టు తెలిసింది.
కలకలం రేపిన ‘సాక్షి’ కథనం
‘నేడు ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు’పేరుతో ‘సాక్షి’ప్రచురించిన కథనం కలకలం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో విద్యారి్థ, ప్రజా సంఘాలతో పాటు అధికార పార్టీ వర్గాలు సైతం దీనిపై తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతింటోందంటూ విషయాన్ని కాంగ్రెస్ నేతలు కొందరు సీఎంవో దృష్టికి తీసుకెళ్ళారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఖరారు కావాల్సిన ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వాయిదా పడింది.