ఆపరేషన్ థియేటర్ వద్ద ప్రొఫెసర్ డా.యెర్రమనేని వంశీ కృష్ణ వైద్య బృందం
నిమ్స్‌లో అందుబాటులోకి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలు
సంక్లిష్ట వెన్నెముక సమస్యలకు సరికొత్త చికిత్స
అరసెంటీమీటర్ పరిమాణంలో రెండు చిన్నకోతలు
స్పైనల్ ట్యూమర్లకూ ఇదే పద్ధతి వాడకం
కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.5లక్షలు ఖర్చయ్యే అవకాశం
ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా పూర్తి ఉచితం
లక్డీకాపూల్: నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) సంక్లిష్టమైన వెన్నెముక సమస్యలతో బాధపడుతున్న రోగుల కోసం అత్యాధునిక ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీని అందుబాటులోకి తెచ్చింది. చికిత్స ఆలస్యమైతే తీవ్రమైన వైకల్యం లేదా పక్షవాతానికి (పారాలసిస్) దారి తీసే మెడ, ఛాతీ భాగంలోని వెన్నెముక సమస్యలకు ఈ మినిమల్లీ ఇన్వాసివ్ (శరీరంపై పెద్ద కోతలు పెట్ట కుండా చాలా చిన్న రంధ్రాల ద్వారా చేసే ఆధునిక శస్త్రచికిత్స విధానం) సాంకేతికత ద్వారా నిమ్స్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందిస్తున్నారు.
ఫ్లోరోసిస్ ప్రభావం వల్ల సరై్వకల్ స్పాండిలోసిస్, ఒపీఎల్‌ఎల్ (ఆసిఫికేషన్ ఆఫ్ పోస్టీరియర్ లాంగిట్యూడినల్ లిగమెంట్/వెన్నెముకకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్య), తదితర సమస్యలు కనిపిస్తుంటాయి. వీటివల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నడిచేటప్పుడు తూలడం, మూత్ర నియంత్రణ కోల్పోవడం వంటి తీవ్ర లక్షణా లు కనిపిస్తాయి. సాధారణంగా వీటికి పెద్ద కోతతో కూడిన ఓపెన్ సర్జరీ అవసరమవ్వగా, నిమ్స్ ఇప్పుడు సరికొత్త యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ (యూబీఈ) విధానాన్ని ప్రవేశపెట్టింది. నిమ్స్ వైద్య బృందం ఇప్పటికే అనేక మంది రోగులకు, సంక్లిష్టమైన మలీ్టలెవల్ సర్వైకల్, థొరాసిక్ కేసుల్లోనూ ఎండోస్కోపిక్ డీ కంప్రెషన్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించింది.
విశేషాలివీ..
అత్యాధునిక సాంకేతికత (యూబీఈ): అర సెంటీమీటర్ పరిమాణంలో రెండు చిన్న కోతల ద్వారా హై–డెఫినిషన్ కెమెరా, ప్రత్యే క పరికరాలను పంపి వెన్నుపాముపై ఒత్తిడి ని తొలగిస్తారు. దీనివల్ల కండరాలు, జాయింట్లు దెబ్బతినవు.
త్వరగా కోలుకునే అవకాశం: చిన్న కోతలు, తక్కువ రక్తస్రావం, ’ఇంట్రా ఆపరేటివ్ న్యూరోఫిజియాలజికల్ మానిటరింగ్’ వాడటం వల్ల సర్జరీ తర్వాత నొప్పి తక్కువ, రోగులు వేగంగా కోలుకుని నడుస్తారు.
నిమ్స్ వైద్య బృందం: నిమ్స్ న్యూరోసర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ డా.యెర్రమనేని వంశీ కృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. మరి యం అఫీఫా నేతృత్వంలోని వైద్యుల బృందం (డా.వసుంధర.ఎస్.రంగన్, డా.ఆదిత్య మడిశెట్టి, డా.అక్షయ్ సింగ్ రాజ్‌పుత్) ఇప్పటికే పలువురికి ఈ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసింది. సంక్లిష్ట స్పైనల్ ట్యూమర్లకు కూడా ఈ పద్ధతిని వాడుతున్నారు.
పేదలకు ఉచితం: కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ తరహా శస్త్రచికిత్సలకు సుమారు రూ.5లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే, నిమ్స్‌లో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అర్హులైన రోగులకు ఆరోగ్య శ్రీ, సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ఈ చికిత్సను పూర్తి ఉచితంగా అందిస్తున్నారు.
⇒ ప్రభుత్వ వైద్య రంగంలో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి చికిత్సను అందుబాటు లోకి తేవడం పట్ల పేద, మధ్యతరగతి రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ శస్త్రచికిత్సకు అవసరమైన యూబీఈ పరికరాలను బీహెచ్‌ఈఎల్, రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ సన్‌షైన్ సంస్థలు విరాళంగా అందించాయి. వ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎంపిక చేసిన వారికి వైద్యులు ఈ చికిత్సను నిర్ణయిస్తారు.


