
మంత్రివర్గంలోస్థానం కోసంఆ సామాజిక వర్గాల ఎమ్మెల్యేల యత్నాలు
కేబినెట్ విస్తరణ సందర్భంగాఅవకాశం కల్పించాలంటూ లేఖలు.. అధిష్టానంపెద్దలతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలకూ విన్నపాలు
నేడు ఢిల్లీకి వెళ్లేందుకు మాదిగ ఎమ్మెల్యేల ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని రెండు ప్రధాన సామాజిక వర్గాలకు ఇప్పుడు కేబినెట్ బెర్తుల ఫీవర్ పట్టుకుంది. మాదిగ, లంబాడా వర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే నెల మూడో తేదీన జరుగుతుందని భావిస్తున్న మంత్రివర్గం విస్తరణలో స్థానం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఫలానా ఎమ్మెల్యేలు మంత్రులయ్యే అవకాశాలున్నాయనే వార్తలు రావడం, తమ వర్గాలకు చెందిన పేర్ల ప్రస్తావన లేకపోవడంతో వారు అప్రమత్తమయ్యారు.
తామెవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, అయితే ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన మాదిగ, లంబాడా వర్గాలకు కచి్చతంగా అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి మాదిగ, లంబాడా ఎమ్మెల్యేలు లేఖలు రాయగా, గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసేందుకు మాదిగ ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మాదిగ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు..?
‘రాష్ట్రంలో 32.33 లక్షల మంది మాదిగ కులస్తులున్నారని 2011 జనగణనలో వెల్లడైంది. ఆ తర్వాత మరో 15 లక్షల మంది జత కలిశారు. మేమంతా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా, అండగా ఉంటున్నాం. అయితే ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వు అయిన నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా మాదిగ కులస్తులకు ఇవ్వలేదు. ఆయా జిల్లాల్లో మాదిగ జనాభానే ఎక్కువ ఉంటుంది.
అందువల్ల త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మా సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే మాకు తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చినట్టవుతుంది. మాదిగ సామాజిక వర్గానికి తెలంగాణ కేబినెట్‌లో మరో అవకాశం ఇవ్వండి..’అని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు రాసిన లేఖలో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను బుధవారం అసెంబ్లీ లాబీల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు అందజేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన వీరు లేఖ ప్రతిని అందజేశారు.
మంత్రి పదవితో బంధం మరింత బలోపేతం
మాదిగ ఎమ్మెల్యేల బాటలోనే లంబాడా ఎమ్మెల్యేలు కూడా లేఖాస్త్రం సంధించారు. తమ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఎన్. బాలూనాయక్, జె.రామచంద్రునాయక్, ఎం.రాందాస్‌నాయక్, బి.మురళీనాయక్‌లు అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఇటు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేలోనే తెలంగాణలో లంబాడాల జనాభా 32.20 లక్షలుగా వెల్లడైంది.
రాష్ట్ర వ్యాప్తంగా 72 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 శాతానికి పైగా లంబాడా ఓటర్లున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి లంబాడా సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్‌లో లంబాడా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి. తద్వారా లంబాడాల ఆకాంక్షను గుర్తించాలి. కేబినెట్‌లో స్థానం కల్పించడం ద్వారా మా వర్గ ప్రాధాన్యతలను అసెంబ్లీలో, ప్రభుత్వంలో వినిపించే అవకాశం ఉంటుంది.
లంబాడాలు, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న బంధం మరింత బలోపేతమవుతుంది..’అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాందీతో పాటు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను బుధవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో ఆయన్ను కలిసి అందజేశారు.