ఎంసెట్‌ కౌన్సెలింగ్‌  ఒకరోజు వాయిదా 

Eamcet Counseling ‌ One Day Postponement In Telangana - Sakshi

నేటి నుంచి జరగాల్సిన చివరి దశ కౌన్సెలింగ్‌ రేపటి నుంచి ప్రారంభం

కోర్టు ఆదేశాల మేరకు ఇంటర్‌లో కనీస మార్కులతో పాసైన వారికి అర్హత

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఎంసెట్‌ చివరి దశ కౌన్సెలింగ్‌ ఒకరోజు వాయిదా పడింది. ఈ ప్రక్రియను శనివారం నుంచి తిరిగి ప్రారంభించేలా ప్రవేశాల కమిటీ సవరించిన షెడ్యూల్‌ జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా 333 మందికి ఎంసెట్‌ ర్యాంకులు పొందే అర్హత లభించనున్నట్లు కమిటీ అంచనా వేసింది. వారందరికీ శుక్రవారం సాయంత్రం వరకు ర్యాంకులను ప్రకటిస్తామని పేర్కొంది. 

అసలేం జరిగిందంటే..  
ఎంసెట్‌ అర్హత సాధించినా ఇంటర్‌లో కనీస మార్కులు (సంబంధిత సబ్జెక్టుల్లో ఓసీలు 45 శాతం, ఇతర రిజర్వేషన్‌ కేటగిరీల వారు 40 శాతం) సాధించలేదన్న కారణంతో చాలా మంది విద్యార్థులకు ఎంసెట్‌ కమిటీ ర్యాంకుల ను కేటాయించలేదు. అయితే కరోనా కారణంగా ఈసారి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. ఆ పరీక్షల కోసం సిద్ధమైన 1.47 లక్షల మందికి ఇంటర్‌ బోర్డు కనీస పాస్‌ మార్కులు (35) ఇచ్చి పాస్‌ చేసింది. అందులో అనేక మందికి ఎంసెట్‌ ర్యాంక్‌ పొందేందుకు అవసరమైన నిర్దే శిత మార్కులు లేకపోవడంతో ఎంసెట్‌ కమిటీ ర్యాంకులు కేటాయించలేదు. దీంతో ఆయా విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు నిర్వహించనం దునే తమకు కనీస అర్హత మార్కులు లేకుండా పోయాయని, తమకు ర్యాం కులు కేటాయించేలా చూడాలని విన్నవించారు. దీంతో వారికి ర్యాంకులు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గురువారం చర్యలు చేపట్టింది. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఉన్నతాధికారులతో సమావేశమై ఎంసెట్‌లో ర్యాంకుల కేటాయింపునకు కావాల్సిన కనీస అర్హత మార్కుల నిబంధనను సడలించి ఆయా విద్యార్థులకు ర్యాంకులను కేటాయించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా జీవో 201ని జారీ చేశారు. సడలింపు నిబంధన ఈ ఒక్క ఏడాదే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంటూ ర్యాంకులను ఎంసెట్‌ కమిటీ శుక్రవారం కేటాయించనుంది. 
ఇంజనీరింగ్‌ చివరి దశ తాజా షెడ్యూల్‌... 
31–10–2020: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌. కొత్త వారికి ఇందులోనే అవకాశం. 
1–11–2020: స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌. 
30–10–2020 నుంచి 2–11–2020 వరకు: వెబ్‌ ఆప్షన్లు. 
2–11–2020: ఆప్షన్లు ముగింపు. 4–11–2020: సీట్ల కేటాయింపు. 
4–11–2020 నుంచి 7–11–2020 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌. సీట్లు పొందిన కాలేజీల్లో 
వ్యక్తిగతంగా రిపోర్టింగ్‌.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top