నేటి నుంచి మీ కోసం..కేబుల్‌ బ్రిడ్జి

Durgam Cheruvu Cable Bridge To Be Inaugurated on Friday - Sakshi

దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ఇక రయ్‌ రయ్‌

రోడ్‌ నంబర్‌ 45 కారిడార్‌ కూడా అందుబాటులోకి..

సాక్షి, హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని హైదరాబాద్‌ ప్రజలు ఎదురుచూస్తున్న దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి నేటి నుంచి అందుబాటులోకి రానుంది. దీంతోపాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 ఎలివేటెడ్‌ కారిడార్‌ను శుక్రవారం సాయంత్రం (నేడు) కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రారంభించ నున్నారు. ఫలితంగా నగరంలోని పలు ప్రాం తాల నుంచి ఐటీ పరిశ్రములున్న వెస్ట్‌జోన్‌కు రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. ఈ ఐకా నిక్‌ బ్రిడ్జి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ తదితర ఐటీ సంస్థల ప్రాంతాలకు అనుసంధానంగా ఉం టుంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36, మాదాపూర్‌ రోడ్‌లో ట్రాఫిక్‌ చిక్కులు తొలగి పోనున్నాయి. జూబ్లీహిల్స్‌ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలి వైపు వెళ్లే వారికి 2 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇప్పటికే ఇది హైదరాబాద్‌ హ్యాంగింగ్‌ బ్రిడ్జిగా, టూరిస్ట్‌ స్పాట్‌గానూ మారింది. బ్రిడ్జిపైన పాదచారుల సంఖ్య కూడా పెరిగింది. బతుకమ్మ ఉత్సవాల్లో బతుకమ్మను, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయపతాకాన్ని కేబుళ్లలలలోని విద్యుత్‌ వెలుగుల్లో చూడవచ్చు. ఇలా ఆయా సందర్భాలను బట్టి దాదాపు 25 థీమ్‌ల విద్యుత్‌కాంతులు చూపరులను ఆకట్టుకోనున్నాయి. 

ప్రారంభానికి సిద్ధంగా ఉన్న దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి 

కేబుల్‌ బ్రిడ్జి వివరాలు.. 
కేబుల్‌ బ్రిడ్జి మొత్తం పొడవు (అప్రోచెస్‌ సహా) :735.639 మీటర్లు
ఎక్స్‌ట్రా డోస్డ్‌ కేబుల్‌ స్టే బ్రిడ్జి పొడవు: 425.85 మీటర్లు (96+233.85+96)
అప్రోచ్‌ వయాడక్ట్‌+సాలిడ్‌ ర్యాంప్‌: 309.789 మీటర్లు
క్యారేజ్‌ వే వెడల్పు: 2్ఠ9మీటర్లు (2్ఠ3లేన్లు)
ఫుట్‌పాత్‌ : 2్ఠ1.8 మీటర్లు 
స్టే కేబుల్స్‌ 56 (26్ఠ2)
ప్రాజెక్ట్‌ వ్యయం: రూ.184 కోట్లు
నిర్మాణ సంస్థ: ఎల్‌ అండ్‌ టీ కన్‌స్ట్రక్షన్‌

దేశంలో పెద్దది..
ఎక్స్‌ట్రా డోస్డ్‌ కేబుల్‌ స్టే బ్రిడ్జిల్లో అత్యంత పొడవైన మెయిన్‌ స్పాన్‌ (233.85 మీటర్లు) దేశంలో ఇదే ప్రథమం. గుజరాత్‌లోని భరూచ్‌లో నర్మద నదిపై 144 మీటర్ల పొడవుతో ఉన్నదే ఇప్పటి వరకు పెద్దది. ప్రపంచవ్యాప్తంగా పరిగణనలోకి తీసుకుంటే ఇది మూడోది.

జపాన్‌లో ఇంతకంటే పెద్దవి ఉన్నప్పటికీ వాటిల్లో స్టీల్‌ను వినియోగించారు. ప్రీకాస్ట్‌ కాంక్రీట్‌ బ్రిడ్జిలో మాత్రం ఇంత పెద్దది ఇంకెక్కడా లేదని ప్రపంచంలోనే ఇది ‘లాంగెస్ట్‌ స్పాన్‌ కాంక్రీట్‌ డెక్‌ ఎక్స్‌ట్రా డోస్డ్‌ కేబుల్‌ స్టేయ్డ్‌ బ్రిడ్జి’అని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌ తెలిపారు.

‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా అమెరికా, యూరప్, రష్యా, హాంకాంగ్‌లకు చెందిన పేరెన్నికగన్న పలు అంతర్జాతీయ ఇంజనీరింగ్‌ సంస్థల సహకారంతో పూర్తి చేసినట్లు ప్రాజెక్ట్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ వెంకటరమణ తెలిపారు. డిజైన్, నిర్మాణం ఈపీసీ పద్ధతిలోనే జరిగాయి. ఈ సంవత్సరం ఆగస్టు నాటికే పనులు పూర్తయినా ప్రత్యేక విద్యుత్‌ థీమ్‌ల కోసం మరికొంత సమయం పట్టింది. దేశంలో మీడియా కంటెంట్‌తో స్టే కేబుల్‌ లైటింగ్‌ ఇదే ప్రథమం. ఎస్సార్‌డీపీ పనుల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ దీన్ని నిర్మించింది. 

ఇంకా..

  • కేబుల్స్‌ కొనుగోలు, వాటి సామర్థ్య పరీక్షలు ఆస్ట్రియా, జర్మనీ దేశాల్లో జరిగాయి. యూకే, కొరియా డిజైనర్ల సహకారం తీసుకున్నారు. 
  • బ్రిడ్జి మీద వెలుగుల కోసం విద్యుత్‌ పోల్స్‌ లేకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ౖఎలాంటి డార్క్‌ పాచెస్‌ ఉండవు. క్యారేజ్‌వే అంతటా ఒకేవిధంగా లైటింగ్‌ ఉంటుంది. ఫుట్‌పాత్‌పై ‘ఎస్‌’వేవ్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు.
  • సెలవుదినాలైన శని, ఆదివారాల్లో వాహనాల ప్రయాణంపై నిషేధం. కేవలం పాదచారులకు మాత్రమే అవకాశం. 
  • వాహనాల స్పీడ్‌ పరిమితి 35 కేఎంపీహెచ్‌గా ఉంటుంది. 
  • 21వ శతాబ్దపు ఇంజనీరింగ్‌ అద్భుతంగా వర్ణిస్తున్నారు. 
  • పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరగకుండా చెరువులో ఎలాంటి పిల్లర్లు వేయలేదు. కేవలం రెండు చివర్లలో రెండు పిల్లర్లు మాత్రమే వేశారు

ఎలివేటెడ్‌ కారిడార్‌
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జిని చేరుకునేందుకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం కూడా పూర్తయింది.ఈ ఫ్లైఓవర్‌ వివరాలు..

పొడవు: 1.74 కి.మీ.
వెడల్పు: 16.60 మీటర్లు(నాలుగులేన్లు)
వ్యయం: రూ.150 కోట్లు 

6 కి.మీ. సాఫీ జర్నీ
 ఈరెండింటి పొడవు దాదాపు 2.5 కి.మీ.లు అయినా 6 కి.మీ.ల మేర ట్రాఫిక్‌ చిక్కులు లేని సాఫీ ప్రయాణంసాధ్యం కానుంది. రోడ్‌ నంబర్‌ 45 జంక్షన్‌ నుంచి మీనాక్షి టవర్స్, గచ్చిబౌలి వరకు సాగిపోవచ్చని అధికారులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top