మామూలుగా తెస్తే లక్షన్నర.. కడుపులో దాస్తే 3 లక్షలు

Drugs Mafia Cocaine Heroin Other Drugs Worth Rs 200 Crore Were Seized By DRI - Sakshi

డ్రగ్స్‌ తరలించేందుకు డబ్బు ఆశ చూపుతున్న మాఫియా 

ఆఫ్రికా దేశాల్లోని పేద మహిళలు, మధ్య వయస్కులే లక్ష్యం 

10 నెలల్లోనే రూ. 200 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సినిమాల్లో చూపించినట్టు ఒకడు విగ్గులో పట్టుకొస్తాడు, మరొకడు కడుపులో దాచుకొని తెస్తాడు, ఇంకొకడు వాటర్‌ బాటిల్‌ లేబుల్‌లో తరలిస్తాడు. ఇలా ఎక్కడో దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి డ్రగ్స్‌ను విదేశాలకు తరలించేందుకు డ్రగ్స్‌ మాఫియా రకరకాల ఐడియాలేస్తోంది. కొన్నిసార్లు స్మగ్లింగ్‌ చేసేందుకు శిక్షణ ఇచ్చి మరీ పంపిస్తోంది. ఒక్కో ట్రిప్‌కు రూ.లక్షన్నర నుంచి రూ. 3 లక్షల వరకు ముట్టజెబుతోంది. ఇలా అక్రమంగా వస్తున్న డ్రగ్స్‌ను డైరెక్టరేట్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ), కస్టమ్స్‌ విభాగాలు ఎక్కడికక్కడ పట్టుకుంటున్నాయి. గతేడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ.200 కోట్ల విలువగల కొకైన్, హెరాయిన్‌ తదితర మాదక ద్రవ్యాలను సీజ్‌ చేశాయి.

ట్రిప్‌కు లక్షన్నర నుంచి 3 లక్షలు
దక్షిణాఫ్రికా, నైరోబి తదితర ఆఫ్రికా దేశాల్లో పేద కుటుంబాల్లోని మహిళలు, మధ్య వయసు వారిని డ్రగ్స్‌ మాఫియా లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సూట్‌కేసు, ఇతర పద్ధతుల్లో తెచ్చే వారికి ప్రతి ట్రిప్‌కు రూ. లక్షన్నర, కడుపులోకి పెట్టుకొని తీసుకొచ్చే వారికి రూ. 3 లక్షల వరకు ఇస్తున్నట్టు తెలిసింది. కడుపులో పెట్టుకొని డ్రగ్స్‌ను ఎక్కువ మొత్తంలో దొరక్కుండా స్మగ్లింగ్‌ చేయొచ్చని, పైగా దీని వల్ల ప్రాణాలకు ప్రమాదమూ ఎక్కువ కాబట్టి ఎక్కువగా డబ్బులిస్తున్నారని వెల్లడైంది. పైగా కడుపులోకి పెట్టుకొని తీసుకువచ్చే వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్టు కూడా డీఆర్‌ఐ గుర్తించింది. స్మగ్లింగ్‌ చేసే వాళ్లకు విమాన చార్జీలు, వసతి సౌకర్యాలు కాకుండానే ఈ సొమ్ము ఇస్తారని వెల్లడైంది.

అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి?
దక్షిణాఫ్రికా, నైరోబి తదితర చుట్టుపక్కల ఆఫ్రియా దేశాల నుంచి వయా దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌కు టాంజానియా, మలావియన్‌ దేశస్థులు డ్రగ్స్‌ తరలిస్తూ పట్టుబడుతున్నారు. దక్షిణఫ్రికాలోని ప్రిటోరియా, జోహెన్నస్‌బర్గ్‌ తదితర ప్రాంతాలకు వ్యక్తులను తీసుకెళ్లి కొకైన్, హెరాయిన్‌ను టాబ్లెట్ల రూపంలో లేదా మరో రూపంలో ఇచ్చి స్మగ్లింగ్‌ చేయిస్తున్నారు. ప్రాణం పోయే ప్రమాదముందని తెలిసినా కొందరు డ్రగ్స్‌ను కడుపులో దాచుకొని 3, 4 రోజులు ప్రయాణించి డెలివరీ స్థానానికి చేరవేస్తున్నారు. పట్టుబడ్డ వ్యక్తులకు డ్రగ్స్‌ ఎక్కడికి చేరుతుందో పూర్తి వివరాలు తెలియట్లేదని డీఆర్‌ఐ వర్గాలు చెప్తున్నాయి.

డ్రగ్స్‌ను తరలిస్తూ పట్టుబడ్డారని తెలిసినా పేదరికం, మరోదారి లేక డ్రగ్స్‌ను చేరవేస్తున్నారని అంటున్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాలకు చేరుతున్న డ్రగ్స్‌ను తమిళనాడు, విశాఖపట్నం తదతర సముద్రతీర ప్రాంతాల ద్వారా ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, హాంకాంగ్‌ తదితర దేశాలకు తరలిస్తున్నట్టు డీఆర్‌ఐ అనుమానిస్తోంది. 

దక్షిణాఫ్రికా నుంచే ఎక్కువగా..
డ్రగ్స్‌ కేసుల్లోని నిందితులు దక్షిణాఫ్రికా నుం చి హైదరాబాద్‌ వచ్చినవారే కావడం ఆందో ళన కలిగిస్తోంది. ఈ నెల 1న దక్షిణాఫ్రికా దేశస్థుల నుంచి రూ.80 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు పట్టుకున్నారు. గత ఏప్రిల్‌లో రూ.11.57 కోట్ల విలువైన కొకైన్‌ టాబ్లెట్లు, రూ.21.9 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీ నం చేసుకున్నారు. గతేడాది జూన్‌లో రూ.78 కోట్ల విలువైన 12 కిలోల హెరాయిన్‌ పట్టుబడగా, ఆ నెలలోనే మరో కేసులో రూ.19.5 కోట్ల విలువైన 3 కేజీల హెరాయిన్‌ పట్టుబడిం ది. భారీగా పట్టుబడిన కేసుల్లోని డ్రగ్స్‌ విలు వ దాదాపు 200 కోట్లుంటే, చిన్నిచితకా కేసులన కలిపితే మరో రూ. 50 కోట్ల మేర ఉం టుందని డీఆర్‌ఐ అధికారులు చెబుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top