
కేంద్ర హోం శాఖ న్యాయ సలహా కోరిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు వీలుగా పీఆర్ చట్ట సవరణకు సర్కారు యత్నం
రాష్ట్రం పంపించిన బిల్లుపై 32 అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టం–2018ని సవరించడంలో భాగంగా ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్‌ను.. న్యాయ సలహా కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకోవైపు ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు సైతం కేంద్రానికి వెళ్లగా..దీనిపై 30 నుంచి 32 అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కేంద్రం తిరిగి రాష్ట్రానికి పంపించినట్లు కూడా తెలిసింది.
కాగా ఆర్డినెన్స్ ముసాయిదాను కేంద్ర హోం శాఖకు పంపిన అంశంపై రాజ్‌భవన్ వర్గాలు స్పందించడం లేదు. ప్రస్తుత పరిమితి 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు చేయడానికి ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రానికి హక్కు ఉన్నట్లుగా ముసాయిదాలో పేర్కొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పీఆర్ చట్టానికి సవరణల వరకే ప్రతిపాదించారా? 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు జరుగుతుందా? ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎంతవరకు అవకాశం ఉందన్నది చర్చనీయాంశమౌతోంది.
ఢిల్లీ స్థాయిలో చర్చ..
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు సాగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపుదల వంటి వాటిపైఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా తాము చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలను గురించి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేతలు రాహుల్‌గాందీ, ప్రియాంక, కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ముసాయిదా ఆర్డినెన్స్, పంచాయతీరాజ్ చట్టంలో 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు ఉండాలనే క్లాజ్ సవరణ విషయంలో ఎలాంటి వైఖరిని అనుసరించాలనే దానిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాను గవర్నర్ కోరినట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో చట్ట, న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎలా ముందుకు వెళ్లాలి తదితర అంశాలపై ఆయన స్పష్టత కోరినట్టు తెలుస్తోంది.