తెలంగాణ: డెలివరీ తర్వాత ఆరేళ్లపాటు కడుపు నొప్పి.. స్కాన్‌ చేస్తే కత్తెర!

Doctors Forgot Scissors In Stomach After Operation At Godavarikhani - Sakshi

కోల్‌సిటీ(రామగుండం): ప్రసవం చేయమని డాక్టరుని వేడుకుంటే..సిజేరియన్‌ ద్వారా కడుపులో బిడ్డను తీసి..కత్తెర ఉంచి కడుపు కుట్టేశారు. దీంతో అనారోగ్య సమస్యలతో బాధితురాలు ఆరేళ్లుగా నరకయాతన అనుభవించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన ఓ మహిళ మొదటికాన్పు కోసం గోదావరిఖనిలోని తన పుట్టింటికి వచ్చింది.

కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక మార్కండేయ కాలనీలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోంలో 2017 ఏప్రిల్‌ 15న చేరింది. మరుసటిరోజు ఆస్పత్రిలోని సీనియర్‌ గైనకాలజిస్టు సిజేరియన్‌ ద్వారా మగబిడ్డకు పురుడు పోశారు. అయితే సిజేరియన్‌ అనంతరం మహిళ కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు వేసి వారం తర్వాత ఇంటికి పంపేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కుటుంబంతో ఉంటున్న సదరు మహిళకు మొదటి కాన్పు జరిగి ఆరేళ్లయినా గర్భం దాల్చలేదు. కడుపునొప్పితోపాటు తరుచూ అనా­రోగ్య సమస్యలు ఎదురవుతుండటంతో రెండురోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చూపించుకుంది. అక్కడి వైద్యుల సూచన మేరకు ఎక్స్‌రే తీయించగా...ఆమె కడుపులో కత్తెర ఉందని వైద్యులు నిర్ధారించారు. 

పరిహారం చెల్లించేందుకు ఒప్పుకున్న వైద్యురాలు 
బాధితురాలికి జరిగిన దారుణంపై కుటుంబ సభ్యులు సిజేరియన్‌ చేసిన గైనకాలజిస్టును నిలదీయడంతో విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు రాజీ కుదుర్చురోవాలని వైద్యురాలు వేడుకున్నారు. బాధితురాలి కడుపులో కత్తెర తీసేందుకు చేసే శస్త్రచికిత్సకు ఖర్చును తానే భరించడంతోపాటుగా రూ.3.50లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో అందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు.

అయితే ఈ విషయం బయటకు తెలియడంతో వెంటనే డబ్బులిచ్చి ఆ మహిళను హైదరాబాద్‌కు తరలిం­చినట్లు తెలిసింది. దీనిపై వైద్యురాలిని వివరణ అడగగా..ఆపరేషన్‌ సమయంలో పొరబాటు జరిగి ఉండొచ్చని చెప్పారు. కాగా, కడుపులోనే కత్తెర మర్చిపోయిన గైనకాలజిస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రామగుండం నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్‌ డిమాండ్‌ చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top