
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
12 నుంచి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ
ప్రజాభవన్‌లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు
ఆర్టీసీలో ఎస్‌హెచ్‌జీలు నడిపే అద్దె బస్సులకు రూ.కోటి చెక్కు అందజేత
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు వచ్చి చూస్తున్నాయన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా శనివారం ఆయన ప్రజాభవన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలసి స్వయం సహాయక సంఘాలకు రూ.కోటి చెక్కును అందించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అద్దె ప్రాతిపదికన నిర్వహిస్తున్న బస్సులకు తొలినెల అద్దె కింద ఈ చెక్కును అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్, ఎస్‌హెచ్‌జీలకు వడ్డీ లేని రుణాలు, ప్రోత్సాహకాలను గాలికి వదిలేసిందన్నారు. తాజాగా ప్రజా ప్రభుత్వం మళ్లీ వడ్డీ లేని రుణాలను ప్రారంభించి మహిళా సంఘాలను ప్రోత్సహిస్తోందన్నారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతిచోట క్యాంటీన్లు, పాఠశాలల మరమ్మతులు, విద్యార్థుల స్కూల్ డ్రెస్సులు కుట్టడం వంటి పనులను మహిళా సంఘాలకు ఇచ్చి వారిని ఆర్థికంగా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వివరించారు.
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారని, అందులో భాగంగా మొదటి సంవత్సరం రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందించామన్నారు. ప్రతీ సంవత్సరం రూ.20 వేల కోట్లకు తగ్గకుండా ఎస్‌హెచ్‌జీలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు.
ఈనెల 12 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజలందరి సమక్షంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్టు వివరించారు. కేవలం వడ్డీ లేని రుణాలే కాకుండా బ్యాంకు లింకేజ్, రుణబీమా, ప్రమాద బీమా వంటి సౌకర్యాలను ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు కల్పిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
భట్టి సాయంతో మహిళకు కేన్సర్ చికిత్స
డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె భర్త
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో ఓ కుటుంబానికి ఊరట దక్కింది. ఏపీలోని ఏలూరుకు చెందిన రామకృష్ణ హైదరాబాద్‌లో మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఆయన భార్య కేన్సర్ లంప్‌తో బాధపడుతున్నట్టు గుర్తించి ఓ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి్పంచారు. కొంతకాలం చికిత్స అనంతరం వారు వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో పడ్డారు. ఈ సమయంలో గాం«దీభవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం జరుగుతుందని తెలుసుకొని రామకృష్ణ కుమారుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలసి లిఖితపూర్వకంగా తన తల్లిదండ్రుల ఆవేదనను వివరించారు.
దీనిపై చలించిన భట్టి వెంటనే రామకృష్ణ భార్యకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించారు. సహాయం ఎక్కడా ఆగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. భట్టి ఇచి్చన లెటర్ ఆఫ్ క్రెడిట్‌తో రామకృష్ణ తన భార్యకు 5 సార్లు కీమోథెరపీ చేయించగలిగారు. కీమో అనంతరం రామకృష్ణ భార్య కేన్సర్ మహమ్మారి నుంచి పూర్తిగా విముక్తి పొందినట్టు వైద్యులు పరీక్షల ద్వారా నిర్ధారించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాయంతో తన కుటుంబం నిలబడిందని రామకృష్ణ అన్నారు. శనివారం ఆయన సచివాలయంలో భట్టిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.