
టీవీ చూస్తూ భర్తను నిర్లక్ష్యం చేయడంతో మొదలైన వివాదం
భర్త చేయి చేసుకోవడంతో ఆత్మహత్యాయత్నం చేసిన భార్య
తల్లి పురుగు మందు తాగడంతో తానూ తాగిన కుమారుడు.. పరిస్థితి విషమం
బయ్యారం: పచ్చని కుటుంబంలో టీవీ సీరియల్ చిచ్చుపెట్టింది. సీరియల్ చూస్తూ తన ను పట్టించుకోవడంలేదని ఆవేదనకు గురైన భర్త.. భార్యతో ఘర్షణకు దిగాడు. దీంతో ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడాన్ని గమనించిన కొడుకు కూడా పురుగు మంది తాగాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కోడిపుంజుల తండాకు చెందిన ధరావత్ రాజుకు మహబూబాబాద్ మండలం సాలార్ తండాకు చెందిన కవితతో పది సంవత్సరాల క్రితం రెండో విహమైంది.
అప్పటికే కవితకు వివాహం జర గగా మున్న (11) అనే కుమారుడు ఉన్నాడు. కొడుకుతో సహా ఆమె రాజుతో కోడిపుంజులతండాలో ఉంటోంది. ఈ క్రమంలో ఆ జంటకు కుమార్తె భవ్యశ్రీ జన్మించింది. కాగా, గురువారం రాత్రి రాజు అన్నం పెట్టమని అడుగగా.. కవిత టీవీలో సీరియల్ చూస్తూ.. కొంత సమయం ఆగమని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన రాజు భార్య కవితతో వాదనకు దిగి చేయి చేసుకోవడంతో వివాదం పెద్దదైంది. ఇరుగు, పొరుగువారు వచ్చి సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది.
శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసు కుంటానని కవిత తమ వ్యవసాయబావి వద్దకు వెళ్లగా స్థానికులు ఆమెను అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత రాజు వ్యవసాయబావి వద్దకు వెళ్లగా, ఇంట్లో ఉన్న కవిత గడ్డిమందు తాగింది. ఇది చూసి ఆమె కుమారుడు మున్న కూడా గడ్డిమందు తాగాడు. స్థానికులు ఈ విషయం గమనించి ఇద్దరినీ మహబూబాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలుడు మున్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.