నేడు టీపీసీసీ విస్తృత భేటీ | Dipadas Munshi who came to Hyderabad as the state incharge | Sakshi
Sakshi News home page

నేడు టీపీసీసీ విస్తృత భేటీ

Jan 3 2024 2:19 AM | Updated on Jan 3 2024 2:19 AM

Dipadas Munshi who came to Hyderabad as the state incharge - Sakshi

సీఎం రేవంత్‌రెడ్డితో దీపాదాస్‌ మున్షీ

సాక్షి, హైదరాబాద్‌: గాంధీభవన్‌లో బుధవారం మద్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్య మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీతోపాటు ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ కార్యదర్శులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, పీఏసీ, పీఈసీ సభ్యులు, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్య దర్శులు, డీసీసీ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల చైర్మన్లు, అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతంపై రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా నియమితురాలైన తర్వాత మంగళ వారం తొలిసారి రాష్ట్రానికి వచ్చిన దీపాదాస్‌ మున్షీ కి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేశ్‌కు మార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరు సతీశ్‌ తదితరులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.  

సీఎంను కలిసిన దీపాదాస్‌ మున్షీ
రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌  హోదాలో దీపాదాస్‌ మున్షీ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై కాసేపు ఆయనతో చర్చించారు. అంతకు ముందు మంత్రి ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డితోనూ మున్షీ భేటీ అయ్యారు. 

రేపు ఢిల్లీకి రేవంత్‌ 
సీఎం రేవంత్‌ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్ల మెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకుగాను అన్ని రాష్ట్రాల సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన డిల్లీ వెళ్లనున్నట్టు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement