‘డీట్‌’తో మరిన్ని ప్రైవేటు కొలువులు! | Digital Employment Exchange of Telangana app linked with Industries and Commerce Department: TS | Sakshi
Sakshi News home page

‘డీట్‌’తో మరిన్ని ప్రైవేటు కొలువులు!

Dec 31 2024 12:34 AM | Updated on Dec 31 2024 12:34 AM

Digital Employment Exchange of Telangana app linked with Industries and Commerce Department: TS

పరిశ్రమలు, వాణిజ్య శాఖతో డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌‌ ఆఫ్‌ తెలంగాణ యాప్‌ అనుసంధానం

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తే ఉచితంగా ఉద్యోగ ఖాళీల సమాచారం

ఇంటర్వ్యూ తేదీలు, అర్హత, శిక్షణకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగుల దరికి చేర్చేందుకు 2019లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత జాబ్‌ పోర్టల్‌/ యాప్‌ ‘డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌‌ ఆఫ్‌ తెలంగాణ’ (డీట్‌)ను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విస్తృతపరి చింది. ఇప్పటివరకు కార్మిక, ఉపాధి కల్పన విభాగంతో ‘డీట్‌’ కలిసి పనిచేస్తుండగా ఇకపై పరిశ్రమలు, వాణిజ్య శాఖతోనూ అనుసంధానం కానుంది. గతంలో కార్మిక శాఖ కింద రిజిస్టర్‌ అయిన ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారం మాత్రమే కనిపించే పరిస్థితి ఉండగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో పరిశ్రమలు, వాణిజ్య శాఖ కింద రిజిస్టర్‌ అయిన ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారం కూడా నిరుద్యోగులకు అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ సేవలు పూర్తిగా ఉచితమని పరిశ్రమలు, వాణిజ్య శాఖ తెలిపింది. ఇటీవలే ‘డీట్‌’ కొత్త లోగోను ప్రభుత్వం ఆవిష్కరించడం తెలిసిందే.

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సమాచారం కూడా.. 
ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారంతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కూడా ‘డీట్‌’లో లభిస్తుంది. ఉద్యోగ ఖాళీలు, ఇంటర్వ్యూ తేదీలు, ఇతర సమాచారం దీనిద్వారా లభి స్తుంది. ఉద్యోగాలు అందించే సంస్థ ప్రతినిధితో నేరుగా మాట్లాడటం, ఇంటర్వ్యూలో పాల్గొనడం, ఆ తర్వాత ఎంపిక ప్రక్రియ, చేరిక, నియామకపత్రం అందజేత తదితర పూర్తి ప్రక్రియంతా ఈ యాప్‌ ద్వారా జరుగుతుంది.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇలా.. 
నిరుద్యోగులు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డీట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  పేరు, మొబైల్‌ నంబర్, ఈ–మెయిల్‌ ఐడీ, తదితర వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
 యాప్‌లోకి లాగిన్‌ అయ్యాక ఉద్యోగాలను అన్వేషిస్తూ విద్యార్థతలకు తగిన ఉద్యోగాలను తెలుసుకోవచ్చు. 

Advertisement
 
Advertisement
Advertisement