నా భర్తను అన్యాయంగా అరెస్ట్‌ చేశారు: వెంకటమ్మ

Dharma Reddy Wife Venkatamma Blames Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కీసర తహసీల్దార్‌ నాగరాజు కేసులో తన భర్తను పోలీసులు వేధించారని ఆత్మహత్య చేసుకున్న ధర్మారెడ్డి భార్య వెంకటమ్మ ఆరోపించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మృతుడి భార్య మాట్లాడుతూ.. ‘భూ వివాదంలో నా భర్తను అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. తహసీల్దార్‌ నాగరాజుకు, నా భర్తకు సంబంధం లేదు. మా ఇంట్లో సోదాల్లో ఎలాంటి పాస్‌బుక్‌ దొరకలేదు. (నాగరాజు కేసు : మరో వ్యక్తి ఆత్మహత్య)

జైలు నుంచి బయటకు వచ్చాక నా భర్త తీవ్ర మనస్తాపం చెందారు. బెయిల్‌పైన వచ్చాక కూడా రోజు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టాలని పోలీసులు వేధించారు. నా భర్తను కలిసి బయటకి వచ్చిన తర్వాత రోజు నాగరాజు జైలులో ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త విన్నాం. ఓ వైపు పోలీసుల వేధింపులు, మరోవైపు భవిష్యత్‌లో ఏమవుతుందో అనే భయంతోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మారెడ్డి కుమార్తెలు మాట్లాడుతూ... ‘మా నాన్నపై కక్ష కట్టి కేసులు పెట్టారు. జైలు నుంచి బయటకి వచ్చాక మనస్తాపం చెందాడు. తన మర్యాద మొత్తం పోయిందని బాధపడ్డాడు. కందాడి భూపాల్‌ రెడ్డి, లక్ష్మారెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మా నాన్నపై ఫిర్యాదు చేశారు. ఏసీబీ,  విజిలెన్స్‌ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారు. కేఎల్‌ఆర్‌ మా భూమిని కబ్జా చేసి వేధించారు. నాగరాజుకు మా నాన్నకు పెద్ద పరిచయం కూడా లేదు. జైలు నుంచి వచ్చాక నేను ఎందుకు బతకాలి... చనిపోతా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లి మా నాన్న తిరిగి రాలేదు. ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని అన్నారు.

కాగా ఇదే కేసులో అరెస్ట్‌ అయిన ధర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్‌ లభించకపోవడంతో జైలులోనే ఉన్నాడు. ధర్మారెడ్డి మృతదేహానికి శవ పరీక్ష పూర్తయ్యింది. అసిస్టెంట్ దాక్టర్ లావణ్య మరియు 5దు గురు పీజీ డాక్టర్స్ బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top