లొంగిపోయిన మావోయిస్టులతో డీజీపీ శివధర్‌రెడ్డి. చిత్రంలో ఐజీ సుమతి తదితరులు
ఏ పద్ధతిలో లొంగుబాటు అన్నది మీ ఇష్టమే
మావోయిస్టులకు డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపు
డీజీపీ సమక్షంలో లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు.. 8 తుపాకుల అప్పగింత
లొంగిపోయిన వారిలో సాంబయ్య, అప్పాసి నారాయణ, సోమడా0త
వారిపై ఉన్న రూ. 1.41 కోట్ల రివార్డును లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చిన డీజీపీ
పరిస్థితులు బాగోలేకే బయటకు వచ్చామన్న సాంబయ్య
సాక్షి, హైదరాబాద్: ‘అజ్ఞాతం వీడి బయటకు రండి. మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం. మీడియా ద్వారానా, మీకు తెలిసిన రాజకీయ నాయకుల ద్వారానా లేక ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానా అనేది మీ ఇష్టం. మీపై ఎలాంటి వేధింపులు లేకుండా చూస్తాం’అని డీజీపీ బి.శివధర్‌రెడ్డి మావోయిస్టులకు పిలుపునిచ్చారు. మావోయిస్టుల లొంగుబాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని.. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు.
మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాచలం–కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజినల్ కమిటీ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ సహా 37 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోయారు. వారిలో 25 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. తమ వద్ద ఉన్న ఒక ఏకే–47, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, నాలుగు .303 రైఫిళ్లు, ఒక జీ3 తుపాకీతోపాటు వివిధ కాలిబర్లకు చెందిన 346 తూటాలను పోలీసులకు అప్పగించారు.
ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, ఎస్‌ఐబీ చీఫ్, ఐజీ సుమతితో కలిసి డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడారు. అంతర్గత విభేదాలు, కూంబింగ్‌లతో పెరిగిన ఒత్తిడి, అనారోగ్య కారణాలతో మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న రివార్డు మొత్తం రూ. కోటీ 41 లక్షల 5 వేలను డీడీ రూపంలో వారికి అందజేశారు.
రాష్ట్రానికి చెందిన మావోయిస్టులకు ప్రభుత్వపరంగా సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారికి తక్షణ సాయం కింద రూ. 25 వేల చొప్పున అందించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 465 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ తెలిపారు.
మీరు కూడా లొంగిపోండి..
తెలంగాణకు చెందిన 59 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ తెలిపారు. వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, పాక హనుమంతు అలియాస్ గణేశ్, పసునూరి నరహరి కాగా, వివిధ రాష్ట్రాల్లో స్టేట్ కమిటీ సభ్యుల స్థాయిలో 10 మంది ఉన్నట్లు చెప్పారు.
వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ఈరెడ్డి పవనానందరెడ్డి, డీకేజెడ్‌సీ మెంబర్‌గా జోడే రత్నాభాయ్ అలియాస్ సుజాత, డీకేజెడ్‌సీ సభ్యుడు లోకేటి చందర్ అలియాస్ ప్రభాకర్, డీకేజెడ్‌సీ కమ్యూనికేషన్ వింగ్ ఇన్‌చార్జి శేఖర్ అలియాస్ మంటూ, తెలంగాణ స్టేట్ కమిటీ ఇన్‌చార్జి బడే చుక్కారావు అలియాస్ దామోదర్, స్టేట్ కమిటీ సభ్యులుగా కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్, ముప్పిటి సాంబయ్య అలియాస్ సుదర్శన్, మేకల మనోజ్ అలియాస్ వినోద్, కర్రా వెంకట్‌రెడ్డి, గంగిటి సత్యనారాయణరెడ్డి అలియాస్ విజయ్‌లు ఉన్నట్లు డీజీపీ తెలిపారు. వారంతా లొంగిపోవాలని సూచించారు.
అనారోగ్యంతోనే లొంగిపోయాం
మారుతున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ లో ఉండి పనిచేయడం కష్టంగా మారడంతోపాటు అనారోగ్య సమస్యలతోనే బయటకు వచ్చామని కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, ముచ్చకి సోమడా మీడియాకు తెలిపారు. పార్టీ అనుమతితోనే పోలీసుల ఎదుట సరెండర్ అయ్యామన్నారు. మిగిలిన వారిని సైతం జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. అయితే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ నాయకుడు ఎవరనేది తమకు తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
లొంగిపోయింది వీరే..
» కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ (తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాచలం–కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజనల్ కమిటీ కార్యదర్శి)
» అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్ (రాష్ట్ర కమిటీ సభ్యుడు)
» ముచ్చకి సోమడా అలియాస్ ఎర్ర (దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీరాష్ట్ర కమిటీ సభ్యుడు)
» తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖమ్మం డివిజినల్ కమిటీ సభ్యులు 9 మంది
» సౌత్–బస్తర్ డివిజినల్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒకరు,
» డివిజినల్ కమిటీ సభ్యులు ఇద్దరు
» ఏరియా కమిటీ సభ్యులు ఏడుగురు
» దళ సభ్యులు 13 మంది
» ఎల్‌జీఏ బెటాలియన్‌కు చెందిన డివిజినల్ కమిటీ సభ్యుడు ఒకరు
» ఏరియా కమిటీ సభ్యుడు ఒకరు


