
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ నగర శివారులోని దేవరయాంజాల్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూముల ఆక్రమణపై ఐఏఎస్ ఉన్నత స్థాయి కమిటీ విచారణ చురుగ్గా సాగుతోంది. మూడో రోజైన బుధవారం ఆలయ భూముల్లో అక్రమంగా నిర్మించినట్లు ఆరోపణలున్న నిర్మాణాలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలోని ఐఏఎస్ అధికారుల కమిటీ పరిశీలించింది. ఆలయ భూముల కబ్జాలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు పలువురి ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు నలుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీని నియమించింది. దీంతో మూడు రోజులుగా ఆలయ భూము ల్లో వెలసిన నిర్మాణాలతోపాటు భూముల వివరాలను కమిటీ బృందం సేకరిస్తోంది.
కష్టంగా వివరాల సేకరణ
దేవరయాంజాల్‌లోని ఆలయ భూములకు సంబంధించి 91 సర్వే నంబర్ల పరిధిలో 39 మందికి సంబంధించి 178కి పైగా వాణిజ్య కట్టడాలు ఉన్నాయి. అయితే, ఇందులో 129కి మాత్రమే ఏడాదికి రూ.1.02 కోట్ల ఆస్తి వన్ను రూపేణా తూముకుంట మున్సిపాలిటికి చెల్లిస్తున్నట్లు తేలింది. ఆలయానికి సంబంధించి దాదాపు 200 ఎకరాల్లో కమర్షియల్ షెడ్లు ఉండగా, మరో 800 ఎకరాల భూములు వ్యవసాయ భూమిగా ఉన్నట్లు తెలుస్తోంది. గోదాములు, కమర్షియల్ షెడ్లతోపాటు ప్రహరీతో నిర్మించిన భూములు వందలాది ఎకరాలుగా ఉండ టం వల్ల వీటికి సంబంధించిన యజమానుల వివరాలు తెలుసుకునేందుకు సమ యం పడుతోంది. బినామీలతోపాటు 2, 3 తరాలకు చెందిన వారు యజమానులుగా ఉన్నట్లు వెల్లడవుతుండటం.. పైగా కొందరు మరణించటం వంటి వాటి వల్ల ఆ వివరాల సేకరణ కష్టంగా మారుతోంది.
డీజీపీఎస్ టెక్నాలజీతో సర్వే
ఆలయ భూములు, అందులోని నిర్మాణాలకు సంబంధించిన వివరాలు పక్కాగా సేకరించేందుకు కమిటీ బృందం అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తోంది. గోదాములు, స్థలం (భూమి) లోకేషన్ ఆధారంగా డీజీపీఎస్ సర్వే చేస్తోంది. దీంతో అంగుళం కూడా తప్పిపోకుండా వివరాలు పక్కాగా ఉంటాయని అధికారులు అంటున్నారు. ఆలయానికి సంబంధించిన 1,531ఎకరాలల్లో 178కి పైగా నిర్మాణాలు ఉండటం వల్ల సర్వే పూర్తి కావడానికి రెండు రోజులు పట్టవచ్చునని సమాచారం.
పత్రాలు చూపుతున్న రైతులు
ఆలయ భూముల్లో సర్వే చేస్తున్న తహసీల్దార్ల బృందాలకు రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతోపాటు పాత రికార్డులు, పత్రాలు చూపిస్తున్నారు. సర్వే నంబర్లు 671, 674, 676, 714లలో పలు నిర్మాణాలు చేపట్టిన రైతులు 25 ఎకరాలకు సంబంధించిన రికార్డులను విచారణ బృందం అధికారి రఘునందన్‌రావుకు చూపించారు. 715, 717, 718 సర్వే నంబర్లలో 16 ఎకరాలున్న యాజమాని కూడా పత్రాలను అందజేశారు.
చదవండి: ఈటలపై భూకబ్జా ఆరోపణలు: వివరాలు వెల్లడించిన కలెక్టర్
Etela Rajender: ఈటలకు షాకిచ్చేందుకు ‘కెప్టెన్’ రెడీ!