
భద్రాద్రి కొతగూడెం జిల్లా. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు స్వయం ఉపాధి అవకాశాన్ని ఎంచుకొని ఎదగడానికి రాజీవ్ యువ వికాసం పథకం వరం లాంటిదన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. భద్రాద్రి కొతగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం టేకులపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ఈ మేరకు మాట్లాడారు.
‘పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఎలాంటి భృతి, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. తెలంగాణ రాష్ట్ర యువత నిరాశా నిసృహల్లో పది ఏండ్లు గడిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 52,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం. మిగిలిన ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించాం.
నిరుద్యోగ యువత తలెత్తుకొనేలా రాజివ్ యువ వికాస పథకాన్ని తీసుకొచ్చాం. భారతదేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదు. జూన్ రెండవ తేదీ కల్లా యువజన వికాసం పథకం లబ్ధిదారులకు మంజూరు లెటర్లు అందజేస్తాం. అవగాహన లేని కొన్ని సోషల్ మీడియా సిబిల్ స్కోర్ విషయంలో తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి. సిబిల్ స్కోర్ కు రాజివ్ యువ వికాస్ పథకానికి ఎలాంటి సంబంధం లేదు’ అని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.