నేను గాలికి రాలేదు.. దేనికీ తలవంచను
కట్టుకథ, పిట్టకథ అల్లి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారు: భట్టి
టెండర్ నిబంధనలు పెట్టేది సింగరేణి... మంత్రికి ఏం సంబంధం?
ఇంగిత జ్ఞానం లేకుండా రాస్తారా?.. టెండర్ల రద్దుకు ఆదేశాలిచ్చా..
వైఎస్‌కు సన్నిహితంగా ఉన్నందునే ఆయన మీద కోపంతో రాశారు
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ‘కొత్తపలుకు’పై డిప్యూటీ సీఎం మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ‘నేను రాజకీయాల్లోకి గాలికి రాలేదు, 40 ఏళ్లపాటు సభలోనూ, బయట పోరాడి భవిష్యత్తు తరాలకు తెలంగాణ సంపదను అందించాలనే లక్ష్యంతో వచ్చా. దారి దోపిడీదారులు, గద్దల్లాంటి వాళ్లు సమాజం మీద పడి పీక్కు తింటుంటే వాళ్లను రక్షించడం కోసం, వాళ్ల తరఫున మాట్లాడటం కోసం రాజకీయాల్లోకి రాలేదు. తెలంగాణ ఆస్తులు, వనరులు, వ్యవస్థలను సమాజంలోని అన్ని వర్గాలకు పంచడమే నా లక్ష్యం’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. ఆదివారం ఉదయం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన పేరును పెద్ద అక్షరాలతో పెట్టి ఓ కట్టుకథ, పిట్టకథను అల్లి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడని మండిపడ్డారు.
ఆయన ఎవరిపై ప్రేమతో, ఎవరి మెప్పు కోసం ఈ కథనం రాశారో, ఏ ఉద్దేశంతో రాశారో, దీని వెనుక ఏ రాజకీయ ఉద్దేశం ఉందో, దాని వెనుక ఎవరుండి రాయిస్తున్నారో త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ‘నా జీవితం చాలా పారదర్శకమైనది. ఆస్తులు సృష్టించుకోవడం కోసమో, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడం కోసమో, అధికారాన్ని హోదాగా అనుభవించడం కోసమో రాజకీయాల్లోకి రాలేదు. ఓ ప్రత్యేక లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చా. ఇలాంటి చిల్లర కథనాలకు భయపడే వారు ఎవరూ లేరు. నేను దేనికీ తలవంచను’ అని భట్టి చెప్పారు. మీడియా సంస్థల మధ్య ఏం వైరం ఉందో వాళ్లే తేల్చుకోవాలి కానీ, తమ ప్రయోజనాల కోసం రాష్ట్రం, పాలన, ప్రభుత్వం, అధికారులు, మంత్రులను లాగుతామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఆ హక్కు ఎవరికీ లేదు
ఎవరి ప్రతిష్టను దెబ్బతీసేలా ఏ మీడియా సంస్థ కూడా వార్తలు వండి వార్చవద్దని భట్టి హితవు పలికారు. అలా రాయడానికి హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. తానేదో మంత్రుల గురించి వార్తలు రాయించాననే ప్ర చారంలో వాస్తవం లేదని, అలాంటి నీచ రాజకీయాల కోసం కట్టుకథనాలు అల్లించే బలహీన వ్యక్తిత్వం భట్టి విక్రమార్కది కాదని స్పష్టం చేశారు. సీఎం, మంత్రులందరం కలిసి తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోసమే పనిచేస్తు న్నామన్నారు.
టెండర్లు రద్దు చేయమని చెప్పా
సింగరేణి గనులు తెలంగాణ ప్రజల ఆత్మ అని, అవి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ఆ ఆస్తులు, ఆత్మను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించడమే తన లక్ష్యమన్నారు. తనకు ఒక బాధ్యత, విధానం ఉంది కనుక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మాదిరి ఎలా అంటే అలా మాట్లాడలేనని, రాయలేనని చెప్పారు. ‘ఎవరికో ఏదో ఉపయోగపడటం కోసం డిప్యూటీ సీఎం పాత్ర ఉందని ఆ కథనంలో రాశారు. బొగ్గు బ్లాకు టెండర్ పిలిచింది సింగరేణి సంస్థ, ఆ సంస్థ బోర్డు. టెండర్ నిబంధనలు పెట్టేది బోర్డు.. మంత్రి కాదు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా తోచింది రాయడం కాదు. సైట్ విజిట్ నిబంధన కావాల్సిన వారికి ఇచ్చుకోవడం కోసం పెట్టారని రాశారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటిలో టెండర్లు పిలిచేటప్పుడు అలాంటి నిబంధన పెడతారు.
క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఆ ప్రాంతాలుంటాయి కాబట్టి విజిట్ చేసి అందుకు తగ్గట్టుగా అంచనాలు వేసుకుని టెండర్లు వేసేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా ఈ నిబంధన ఉంది. నిజాయితీగా ఉండటమే కాదు.. ఉన్నట్టు కూడా జనాలకు కనిపించాలి. అది నేను నమ్ముతాను. అందుకే అన్ని నిబంధనలూ క్షుణ్ణంగా పరిశీలించి బోర్డును అన్ని విషయాలు అడిగాను. టెండర్ రద్దు చేసి మళ్లీ టెండర్‌కు వెళ్లమని అడిగాను.
టెండర్ పిలిచింది ఇప్పుడే.. ఎవరూ పాల్గొనలేదని అధికారులు చెప్పారు. నేను మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉండి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండటం వల్ల, ఆయన మీద ఉన్న కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కానీ ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలు, సింగరేణి, పాలనకు సంబంధించింది కాదు. అనుమానం వచ్చింది కాబట్టి రద్దు చేయండి. మిగిలిన విషయాలు నేను, రాధాకృష్ణ తేల్చుకుంటాం అని అధికారులకు చెప్పా. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి వెంటనే రద్దు చేయండని ఆదేశాలిచ్చా’ అని భట్టి చెప్పారు.


