Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌... మరో చార్జిషీట్‌లోనూ ఎమ్మెల్సీ కవిత పేరు

Delhi liquor scam: K Kavithas name surfaced in another charge sheet - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి సమీర్‌ మహేంద్రుతో పాటు మరో నాలుగు మద్యం సంస్థలపై ఈడీ మంగళవారం ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, శరత్‌చంద్రారెడ్డిలు.. బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ రామచంద్ర పిళ్‌లైలను తమ ప్రతినిధులుగా పేర్కొన్నారని ఈడీ తెలిపింది. ముత్తా గౌతమ్‌ పేరును ప్రస్తావించింది. కవిత వాడిన పది ఫోన్లను ధ్వంసం చేయడాన్ని కూడా ప్రస్తావించింది.

ఎవరి ఖాతాల నుంచి ఎవరెవరి ఖాతాలకు డబ్బులెళ్లాయి అనే వివరాలను కూడా స్పష్టంగా పేర్కొంది. చార్జిషీట్‌ దాఖలుకు గాను 30 మందిని విచారించినట్లు తెలిపింది. శరత్‌ చంద్రారెడ్డి చేతుల్లోని ఐదు రిటైల్‌ జోన్లను అభిషేక్‌ రావు నడిపిస్తున్నట్టు పేర్కొంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తమ విచారణలో సమీర్‌ మహేంద్రు చెప్పాడని తెలిపింది. శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్, బుచ్చిబాబులు ఒబెరాయ్‌ హోటల్‌లో సమీర్‌ మహేంద్రును కలిసినట్టు వివరించింది. అనంతరం వారు శరత్‌ చంద్రారెడ్డికి సంబంధించిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వెళ్లినట్టు తెలిపింది. 
ఒబెరాయ్‌ హోటల్‌ భేటీలోనూ కవిత! 
ఇండో స్పిరిట్స్‌కు ఎల్‌ 1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ అభియోగం మోపింది. ఒబెరాయ్‌ హోటల్‌లో జరిగిన సమావేశంలోనూ కవిత, అరుణ్‌ పిళ్లై, దినేష్‌ అరోరా, విజయ్‌ నాయర్‌లు పాల్గొన్నట్టు పేర్కొంది. సమీర్‌ మహేంద్రు ఫేస్‌ టైంలో రెండుసార్లు, ఒకసారి హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా కవితను కలిసినట్టు వివరించింది. ఇండో స్పిరిట్‌లో రామచంద్ర పిళ్‌లై వెనుక ఉండి నడిపించింది ఎమ్మెల్సీ కవిత అని, ప్రేమ్‌ రాహుల్‌.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి తరఫున పనిచేస్తున్నారని వివరించింది. ఇండో స్పిరిట్స్‌లో అసలైన పార్టనర్స్‌ కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని అభియోగం మోపింది.  
అరుణ్‌ పిళ్లైకి రూ.32.26 కోట్ల లాభం 
అరుణ్‌పిళ్‌లై 32.5% వాటా నిమిత్తం పెట్టుబడి రూ.3.4 కోట్లు చెల్లించగా అతనికి 65% లాభంతో రూ.32.26 కోట్లు వచ్చినట్లు ఈడీ తెలిపింది. ప్రేమ్‌ రాహుల్‌ రూ.5 కోట్ల పెట్టుబడి పెట్టగా ఎలాంటి లాభం చూపించలేదు. ప్రేమ్‌ రాహుల్‌ను డమ్మీగా చూపించి 65% వాటాను అరుణ్‌ పిళ్‌లై నియంత్రించారని ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్‌ డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌ తరఫున సమీర్‌ మహేంద్రు 35% వాటాగా రూ.5 కోట్ల పెట్టుబడితో 35% లాభం పొందారని తెలిపింది. వీరిపై మనీలాండరింగ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రత్యేక కోర్టును ఈడీ కోరింది. 

విచారణ జనవరి 5కు వాయిదా 
 సమీర్‌ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది. జనవరి ఐదులోగా కౌంటరు దాఖలు చేయాలని సమీర్‌ మహేంద్రుతో పాటు నాలుగు మద్యం సరఫరా, తయారీ సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 5కు వాయిదా వేసింది. ఇలావుండగా జ్యుడీషియల్‌ రిమాండులో ఉన్న సమీర్‌ బెయిలు పిటిషన్‌పై విచారణ జనవరి 3కు వాయిదా వేసింది.
చదవండి: ఎంపీ సంతోష్‌పై ‘ఇండియా ఫోర్బ్స్‌’ కథనం 
 

    

 
    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top