
యూనిట్–1ను జాతికి అంకితం చేసిన డిప్యూటీ సీఎం భట్టి
మంత్రులు లక్ష్మణ్, ఉత్తమ్, కోమటిరెడ్డిలతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష
మిర్యాలగూడ: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యంతోనే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) యూనిట్–1లో విద్యుత్ ఉత్పత్తిని ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు లక్ష్మణ్‌కుమార్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
పవర్‌స్టేషన్‌లో మొత్తం ఐదు యూనిట్లు ఉండగా.. రెండో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తిని ఈ ఏడాది జనవరి 21 సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఒక్కో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 800 మెగావాట్లు. ప్లాంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, మిగతా మూడు యూనిట్లను డిసెంబర్ నాటికి పూర్తి చేసి, వచ్చే ఏడాది జనవరి 26 నుంచి పూర్తిగా జాతికి అంకితం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం రెండేళ్లపాటు పర్యావరణ అనుమతులపై క్లియరెన్స్ తీసుకురాకపోవడంతోనే ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సమయాన్ని నిర్దేశించుకోని అనుకున్న కార్యాచరణ ప్రకారం సంవత్సరం, నెల, వారానికి చేయాల్సిన పనులపై కేలెండర్ ప్రకారం ముందుకు వెళ్లామని చెప్పారు. సంవత్సర కాలంలోనే రెండు యూనిట్లు పూర్తి చేశామని తెలిపారు. విద్యుత్ ఉత్పాదనతోపాటు వైటీపీఎస్‌లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల ఏర్పాటు, పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రి, అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సిబ్బందికి క్వార్టర్స్ నిర్మిస్తున్నామని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళుతున్నట్టు చెప్పారు. రహదారులు దెబ్బతినకుండా సీసీ రోడ్డు పనులు మొదలుపెట్టామన్నారు. భూములు కోల్పోయిన వారికి గత ప్రభుత్వం పరిహారాన్ని గాలికి వదిలేస్తే..తాము ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఉద్యోగాలు, పునరావాస కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు కింద నష్టపోయిన కొందరు రైతులకు కూడా వైటీపీఎస్‌లో ఉద్యోగాలు, పరిహారం అందచేస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై.రాజశేఖరరెడ్డి, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిత్తల్, జెన్‌కో సీఎండీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.