రెవెన్యూ శాఖ ఏం పనిచేస్తోంది? | Delays in resolving public applications burden the courts | Sakshi
Sakshi News home page

రెవెన్యూ శాఖ ఏం పనిచేస్తోంది?

Jul 8 2026 1:51 AM | Updated on Jul 8 2026 1:51 AM

Delays in resolving public applications burden the courts

ప్రజల దరఖాస్తుల పరిష్కారంలోజాప్యంతో కోర్టులపై భారం 

శాఖ పనితీరుపై హైకోర్టు ఆగ్రహం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకోకుండా రెవెన్యూ శాఖ ఏం చేస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. అధికారుల అలసత్వం కారణంగా పెరిగిపోతున్న పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భూ సంబంధిత దరఖాస్తులను సకాలంలో పరిష్కరించకపోవడంతో ప్రజలు పెద్దఎత్తున హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని అభిప్రాయపడింది. అధికారులు తమ విధులను నిర్ణీత గడువులో నిర్వర్తిస్తే ఇటువంటి వ్యాజ్యాలు కోర్టుకు రావాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. రెవెన్యూ సేవలకు సంబంధించిన పౌరుల ఫిర్యాదుల పరిష్కారానికి అనుసరిస్తున్న ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌వోపీ) ఏంటని ప్రశ్నించింది. 

రోజూ న్యాయస్థానం ముందుకొస్తున్న పిటిషన్లలో దాదాపు ఒకే రకమైన ఫిర్యాదులు ఉంటున్నాయని వ్యాఖ్యానించింది. దరఖాస్తులు చేసినా ఫీల్డ్‌ సర్వేలు నిర్వహించకపోవడం, రెవెన్యూ రికార్డుల్లో పేర్ల మారి్పడిలో జాప్యం, రెవెన్యూ ఎంట్రీలను సరిదిద్దకపోవడం, పట్టాదారు పాస్‌ బుక్‌ల నుంచి సర్వే నంబర్లను తొలగించడం, రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌లు లేదా ఇతర కన్వేయన్స్‌ల తర్వాత పట్టాదారు పాస్‌ బుక్‌ల జారీలో జాప్యం లాంటి సమస్యలు ఉంటున్నాయని పేర్కొంది. ఎస్‌వోపీపై నాలుగు వారాల్లోగా సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది.  

మీ పని చేయడానికీ కోర్టు ఆదేశాలు... 
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం ఊట్పల్లిలోని ఎకరం భూమిని రెవెన్యూ రికార్డుల్లో తన పేరిట నమోదు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ హన్మాండ్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దరఖాస్తు పెండింగ్‌లోనే ఉందని, సంబంధిత అధికారులను నిర్ణయం తీసుకోవాలని ఆదేశించాలని కోరారు. రెవెన్యూ ఏజీపీ వాదిస్తూ.. దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకుంటున్నా పోస్టల్‌ వ్యవస్థ ద్వారా సమాచారాన్ని పంపడంలో ఆలస్యం జరుగుతోందన్నారు. 

ఈ సందర్భంగా న్యాయమూర్తి రెవెన్యూ శాఖ పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వం కారణంగా ప్రజలు కోర్టును ఆశ్రయించాల్సి వస్తుండటంతో, పరిపాలనావ్యవస్థ చేయాల్సిన పనులపై హైకోర్టు ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాజ్యాలతో కోర్టుపై అనవసర భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటే అనవసరంగా కోర్టులను ఆశ్రయించే పరిస్థితి తగ్గుతుందన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement