నర్సులు లేరు.. డాక్టర్లు రారు! | Deficiencies in health services for women, elderly and tribals | Sakshi
Sakshi News home page

నర్సులు లేరు.. డాక్టర్లు రారు!

Jul 8 2026 4:23 AM | Updated on Jul 8 2026 4:23 AM

Deficiencies in health services for women, elderly and tribals

మహిళలు, వృద్ధులు, గిరిజనుల ఆరోగ్య సేవల్లో లోపాలు 

సిబ్బంది కొరతతో ‘ఆశ’లపై పెరుగుతున్న భారం 

చికిత్సలకు ప్రాధాన్యం ఇస్తూ నివారణ చర్యలపై దృష్టి పెట్టడం లేదు 

‘టీజీ– స్వస్త్‌’కోసం రూపొందిన ‘ఎస్సా’ నివేదికపై ప్రపంచ బ్యాంకు వ్యాఖ్య 

బ్యాంకు రుణాన్ని సేవల రంగంపైనే వెచ్చించాలని ప్రాథమిక షరతు  

సాక్షి, హైదరాబాద్‌: అధునాతన టీచింగ్‌ హాస్పిటల్స్‌.. క్షణాల్లో రోగ నిర్ధారణ చేసే ఆధునిక వైద్య పరికరాలు.. ఎలాంటి రోగానికైనా చికిత్స అందించే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వైద్యులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్య రంగంలో తెలంగాణ గణనీయంగానే అభివృద్ధి చెందింది. కానీ, ప్రజారోగ్య వ్యవస్థ మాత్రం ఇంకా అనేక నిర్మాణాత్మక సమస్యలతో సతమతమవుతోంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ ప్రపంచబ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. తెలంగాణలో ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు 300 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,500 కోట్ల) రుణంతో అమలు చేయాలని నిర్ణయించిన ‘తెలంగాణ స్ట్రాటజిక్‌ విజన్‌ ఫర్‌ అటైనింగ్‌ సస్టైనబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఇన్‌ హెల్త్‌కేర్‌ (టీజీ–స్వస్త్‌) కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన పర్యావరణ, సామాజిక వ్యవస్థల అంచనా (ఈఎస్‌ఎస్‌ఏ–ఎస్సా) నివేదికలో ప్రపంచబ్యాంకు ఈ అంశాలను ప్రస్తావించింది. తెలంగాణలోని గిరిజన తండాలు, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని, పీహెచ్‌సీలతోపాటు ప్రభుత్వ వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రులు, మండల, జిల్లా స్థాయిల్లోని దవాఖానాల్లో సేవలందించే వైద్యులు, నర్సులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఆక్షేపించింది. ఆయా ప్రాంతాల్లో వైద్యులు రాక, నర్సులు లేక ప్రజారోగ్యవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించింది. కోట్లు ఖర్చు చేసి కొత్త ఆస్పత్రుల నిర్మాణం చేపట్టడం కంటే, వైద్యరంగంలో సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.  

ఆశ, ఏఎన్‌ఎంలపై పనిభారం  
ఆరోగ్య కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేయడంతో సిబ్బంది అవసరం మరింత పెరిగిందని నివేదిక తెలిపింది. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లను ఏరియా ఆస్పత్రులు, బోధనా ఆస్పత్రులుగా మార్చినా, అవసరమైన సిబ్బంది నియామకాలు పూర్తిస్థాయిలో జరగలేదని పేర్కొంది.  
⇒ ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, పురుష బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలపై రోజురోజుకూ పనిభారం పెరుగుతోందని, వారి బాధ్యతలను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరముందని సిఫారసు చేసింది.  
⇒ రాష్ట్ర జనాభాలో 9 శాతం గిరిజనులే అయినా, వారి ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు ఇంకా వెనుకబడి ఉన్నాయని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. వీరికోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ఆరోగ్య సేవల లోటును గుర్తించి అమలు చేయాలని సిఫారసు చేసింది.  
⇒ మొబైల్‌ మెడికల్‌ యూనిట్లు, కొత్త ఉపఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదని తెలిపింది. 

వృద్ధుల సంరక్షణకు కొత్త విధానం 
2036 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా 17 శాతానికి చేరొచ్చని నివేదిక పేర్కొంది. వృద్ధులకు ఇంటి వద్దే వైద్య సేవలు, డే కేర్‌ కేంద్రాలు, శిక్షణ పొందిన సంరక్షకుల వ్యవస్థ, ప్రత్యేక మార్గదర్శకాలు అవసరమని తెలిపింది. వృద్ధులకు అనుకూలంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ర్యాంపులు, హ్యాండ్రెయిల్స్, ప్రత్యేక మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని సిఫారసు చేసింది.  
⇒ ప్రస్తుతం ప్రజావాణి, 104 కాల్‌సెంటర్, ఫిర్యాదు పెట్టెలు, ఆస్పత్రి కమిటీలు వంటి అనేక ఫిర్యాదు వ్యవస్థలు ఉన్నా, అవి విడివిడిగా పనిచేస్తున్నాయని నివేదిక పేర్కొంది. వీటన్నింటినీ ఒకే డిజిటల్‌ వ్యవస్థలో అనుసంధానించి, ఫిర్యాదుల పరిష్కారాన్ని పర్యవేక్షించే విధానం తీసుకురావాలని సూచించింది. 
⇒ లైంగిక వేధింపులు, సేవలపై ఫిర్యాదులను కూడా ప్రత్యేకంగా నమోదు చేసి పర్యవేక్షించాలని పేర్కొంది.  

ప్రైవేటు ఆస్పత్రులపై ఆందోళన 
తెలంగాణలో సిజేరియన్‌ ప్రసవాలు, గర్భాశయ తొలగింపు శస్త్రచికిత్సలు (హిస్టరెక్టమీ) అధికంగా జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. గ్రామీణ, నిరక్షరాస్యత మహిళల్లో ఇవి ఎక్కువగా నమోదవుతున్నాయని, దీనివల్ల ప్రైవేటు వైద్య రంగంపై పర్యవేక్షణ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. మహిళల ఆరోగ్య సేవలు ప్రసూతి సేవలకే పరిమితం కాకుండా కేన్సర్‌ స్క్రీనింగ్, మానసిక ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులపై కూడా దృష్టి పెట్టాలని సూచించింది.  
⇒ ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే స్థాయిలో లేదని నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌ పరిసరాల్లో పరిస్థితి మెరుగ్గా ఉన్నా, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మరింత శ్రద్ధ అవసరమని తెలిపింది.  

ఎనిమిది లక్ష్యాల ఆధారంగానే ప్రపంచ బ్యాంకు రుణం 
టీజీ–స్వస్త్‌ రుణానికి సంబంధించి ప్రపంచబ్యాంకు 8 అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది. రక్తపోటు, మధుమేహ నియంత్రణ, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ స్క్రీనింగ్, మిడ్‌వైఫ్‌ ఆధారిత ప్రసూతి సేవలు, వృద్ధులకు ఇంటి వద్ద వైద్యం, యుక్త వయసు బాలికల్లో రక్తహీనత తగ్గింపు, వృద్ధుల సంరక్షణ వ్యవస్థ, ప్రైవేట్‌ రంగ బాధ్యతాయుత సేవలు అనే 8 లక్ష్యాల ఫలితాల ఆధారంగా ప్రపంచ బ్యాంకు రుణం విడుదల కానుంది. ఈ లక్ష్యాల సాధనను స్వతంత్ర సంస్థ ధ్రువీకరించిన తర్వాతే విడతల వారీగా నిధులు అందుతాయి.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement