
కంటోన్మెంట్: సుప్రసిద్ధ రచయిత డాక్టర్ దాశరథి రంగాచార్య సతీమణి దాశరథి కమల (92) మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల నడుమ మంగళవారం సాయంత్రం మారేడుపల్లిలోని హిందూ శ్మశాన వాటికలో ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. దాశరథి దంపతులకు కుమారుడు విరించి, ఇద్దరు కుమార్తెలు సుధ, ఉదయశ్రీ ఉన్నారు. దాశరథి రంగాచార్య సాహితీ ప్రస్థానంలో కమల కీలక పాత్ర పోషించారు.
ఆయన రచనలకు కమల వెన్నెముకగా నిలిచారని సాహిత్య లోకం గుర్తుచేసుకుంటోంది. దాశరథి కమల ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు రచయితలు, సాహితీ అభిమానులు ఆకాంక్షించారు. ఆమె మరణం సాహిత్య లోకానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ మున్సిపాలిటీ చివరి కమిషనర్‌గా పనిచేసిన దాశరథి పదవీ విరమణ అనంతరం ఈస్ట్ మారేడుపల్లిలో స్థిరపడ్డారు. 2015 జూన్ 7న ఆయన మరణించారు.