పోలీసుల కళ్లుగప్పి.. న్యూట్రీఫెర్మ్‌తో గుడుంబా.. తాగితే ప్రాణాలు పోవడం ఖాయం!

Danger To Life With Nutri Farm Gudumba - Sakshi

కొత్తగూడ(మహబూబాబాద్‌ జిల్లా): ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు, గిరిజనులు మొదట సహజసిద్ధమైన ఇప్పపువ్వుతో గుడుంబా తయారు చేసుకుని తాగేవారు. క్రమంగా బెల్లం, పటిక, యూరియాతో తయారుచేసి గుడుంబాను విక్రయించారు. అయితే నల్లబెల్లం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో కొన్ని రోజులు చక్కెర వినియోగించారు. కాగా బెల్లంతో అయినా చెక్కెరతో అయినా గుడుంబా తయారీలో పటిక క్రీయాశీలకంగా మారింది. కాగా పటిక దొరక్కపోవడంతో  తయారీదారులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. న్యూట్రీఫెర్మ్‌ స్ప్రే మందుతో గుడుంబా తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
చదవండి: ప్రగతి భవన్‌లో మంత్రి ‘కేటీఆర్‌’ ఎమోషనల్‌ సీన్‌..

500గ్రాముల ప్యాకెట్‌తో 20సీసాలు..
పటిక దొరక్కపోవడంతో తయారీదారులు కొత్తదారిలో వెళ్తున్నారు. 500గ్రాముల ప్యాకెట్‌తో 20 సీసాల గుడుంబా వస్తోంది. దీనికి బెల్లం, చక్కెర, పటికతో పనిలేదు. పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు పట్టుకునే అవకాశం లేదు. యథేచ్ఛగా తీసుకెళ్లవచ్చు. మిర్చి, పత్తిలాంటి ఆరుతడి పంటల ఎదుగుదలకు న్యూట్రీఫెర్మ్‌ అనే మందు ఫర్టిలైజర్‌ షాపుల్లో దొరుకుతుంది. ఓ ప్యాకెట్‌ తీసుకుని ఒక డ్రమ్ములో సగం నీరు పోసి కలియబెట్టి రెండు రోజులు నానబెడతారు.  మూడోరోజు గుడుంబా తయారు చేసే విధంగానే బట్టీ పెడతారు. సాధారణంగా గుడుంబా తయారు చేయడాని వారం రోజులు పడుతుంది. దీనికి రెండు రోజులే సమయం పట్టడం, అధికారులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా న్యూట్రీఫెర్మ్‌ గుడుంబా తయారు చేస్తున్నారు.

వాపు వస్తున్న ముఖాలు.. 
పంటలపై స్ప్రే చేసే మందుతో తయారుచేసే గుడుంబా వల్ల తయారీదారుల ముఖాలు వాపు వస్తున్నట్లు తెలిసింది. ముఖాలు వాస్తున్నా లాభాల కోసం గుడుంబా తయారీని వారు మానడం లేదు. అయితే తయారీదారుల పరిస్థితి ఇలా ఉంటే తాగే వారి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. తాగిన వారి అవయవాలు త్వరగా పాడైపోయి మృత్యువుకు దగ్గర కావడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. గుడుంబాతో ఎక్కువ లాభాలు ఉండడంతో కొందరు కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు. వీరిపై ఎన్ని కేసులు బనాయించినా గుడుంబా తయారీని మాత్రం మానడం లేదు.

నాజీతండా కేంద్ర బిందువు..?
నూతన గుడుంబా తయారీ విధానానికి వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం నాజీతండా కేంద్ర బిందువు అని తెలుస్తోంది. ఈ గ్రామంలో గుడుంబా తయారు చేసి పలు గ్రామాలకు సరఫరా చేయడంతో పలు కేసులు నమోదయ్యాయి. మూడు మండలాల సరిహద్దు గ్రామం కావడంతో పోలీసుల నిఘా తక్కువ. ఎక్సైజ్‌ అధికారులకు తండావాసులు భయపడకపోవడం గమనార్హం.

ఖానాపురం మండలంలోని పలు గ్రామాలతో పాటు జిల్లాలోని కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లో దాదాపు అన్ని గ్రామాలకు ములుగు జిల్లా పస్రా మండలంలోని పలు గ్రామాలకు ఇక్కడి గుడుంబా సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఇక్కడి మహిళలు గుడుంబా తయారు చేస్తారు. చిన్నచిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్‌ చేసి భార్యభర్తలు ద్విచక్రవాహనాల ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తారు. మధ్యలో ఎవరైనా ఆపి తనిఖీ చేసేందుకు యత్నిస్తే మహిళలు అరవడం, గోల చేయడం, తమపై అత్యాచారయత్రం చేకస్తున్నారని  గగ్గోలు చేసి అధికారులను భయానికి గురిచేస్తారు.

మద్యం ధరలు పెరగడంతో..
ప్రభుత్వం మద్యం ధరలను పెంచడంతో రోజువారి కూలీలు, వ్యవసాయదారులు గుడుంబా తాగడానికి మొగ్గు చూపుతున్నారు. పొద్దంతా పొలం పనులు చేసి రాత్రి సమయంలో అధికంగా వెచ్చించి మద్యం తాగలేక చాలా మంది గుండుబా తాగుతున్నారు. అయితే నూతన గుడుంబా తయారీ విధానం వారికి తెలియకే తాగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.

ప్రాణాలకే ప్రమాదం
గుడుంబా దేనితో తయారు చేసినా తాగడం ప్రాణాలకే ప్రమాదం. ఇంకా స్ప్రే మందుతో తయారు చేసిన గుడుంబాను అస్సలు తాగొద్దు. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది రోగుల్లో గుడుంబా కారణంగా కిడ్నీలు, లివర్, గుండె ఇతర అవయవాలు దెబ్బతినడం గమనిస్తున్నాం. దీని ప్రభావం పేగులపై కూడా పడుతుంది. 
–రవీందర్‌నాయక్,అసిస్టెంట్‌ ప్రొఫెసర్, మానుకోట మెడికల్‌ కాలేజీ 

కఠిన చర్యలు తీసుకుంటాం
గుడుంబాను అరికట్టేందుకు బెల్లం, పటిక రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేశాం. స్ప్రే మందులతో గుడుంబా తయారీ నా దృష్టికి రాలేదు. ఇక నుంచి వాటిపై కూడా దృష్టి పెడుతాం. ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా తయారు చేయడం, తాగడం సరైంది కాదు. ప్రజలు చైతన్యవంతులై గుడుంబాను నిషేధించడంతో పాటు ఎక్కడ గుడుంబా తయారు చేసినా సమాచారం అందించాలి. 
–నగేష్, ఎస్సై   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top