Bachupally: తీరని శోకాన్ని మిగిల్చిన ‘ఓవర్‌టేక్‌’

Cyberabad Traffic Police Tweet Bachupally Accident Video - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒక్కసారి రోడ్డు మీదకు వచ్చామంటే.. ఒళ్లంతా కళ్లు చేసుకుని జాగ్రత్తగా చుట్టుపక్కల గమనిస్తూ.. వాహనాలు నడపాలి. మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించి.. మనమే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. కేవలం ప్రాణం పోవడమే కాదు.. కొన్నేళ్ల పాటు మన కుటుంబం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది అని గుర్తుంచుకోవాలి. అర సెకను అజాగ్రత్త.. ఎంతటి కష్టాన్ని, నష్టాన్ని మిగులుస్తోందో చెప్పడానికి మాటలు చాలవు. ఇందుకు సంబంధించిన వీడియోని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తమ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఆ ప్రమాద వివరాలు..

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ‘‘దీని ద్వారా మీరు ఏం గమనించారు’’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియోలోని ప్రమాదం బాచుపల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. రోడ్డు మీద కొన్ని వాహనాలు వెళ్తుంటాయి. పెద్దగా రద్దీగా కూడా లేదు. రోడ్డు మీద లారీ, ఇన్నోవా వెళ్తుంటాయి. ఈ రెండింటి మధ్య ఓ వ్యక్తి బైక్‌ మీద వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఇన్నోవాకు ముందు ప్రయాణిస్తున్న ఆటో.. దానికి దారి ఇవ్వడం కోసం కొద్దగా ముందుకు వెళ్లి ఓ పక్కకు ఆగుతుంది. 

ఇక అంతసేపు ఇన్నోవాకు అతి సమీపంలో ఉన్న బైకర్‌.. ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నిస్తూ.. లారీ ముందుకు వెళ్తాడు. అయితే ఇది గమనించని లారీ డ్రైవర్‌ ఫాస్ట్‌గా వెళ్లడంతో బైక్‌ను ఢీ కొడతాడు. దాంతో ఆ‍ వ్యక్తి ఎగిరి లారీ కింద పడి కొద్ది దూరం వెళ్తాడు. లారీలోని వ్యక్తి ప్రమాదాన్ని గుర్తించి కిందకు దిగి చూస్తుంటాడు. ఇంతలో లారీ కొంచె దూరం వెనక్కి కదిలి.. దాని కిందే ఉన్న బైకర్‌ మీదుగా కొంచెం దూరం వెళ్తుంది. కింద ఉన్న వ్యక్తి హెచ్చరించడంతో లారీని ఆపుతాడు. ఓవర్‌టేక్‌ చేయాలనే అర సెకను కోరిక.. బైకర్‌కి.. అతని  కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందనే దాని గురించి వీడియోలో ఎలాంటి సమాచారం లేదు. 

ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని షేర్‌ చేశామని.. ఇతరుల అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు అంటూ సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తమ ట్విటర్‌లో దీన్ని షేర్‌ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా బాధితుడిది, ఇన్నోవా డ్రైవర్‌దే తప్పని విమర్శిస్తున్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top