
ఓ సొసైటీ అధ్యక్షుడికి సైబర్ నేరగాళ్లు వల, విఫలయత్నం
విజయవాడ: సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం ఎత్తారు. రాజకీయ నాయకుల వాయిస్‌తో మాట్లాడుతూ ఓ సొసైటీ అధ్యక్షుడిని రూ. లక్ష అడిగి విఫలయత్నం చేశారు. మూరకొండ ఏడుకొండలరావు కంచికచర్ల మండలం ఘనిఆత్కూరు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు ఈ నెల 8న రాత్రి వాట్సాప్ కాల్‌చేసి మాజీ మంత్రి దేవినేని ఉమా వాయిస్‌లో మాట్లాడి ఎక్కడున్నావ్ అని అడిగారు. నేను పక్క ఊరిలో ఉన్నానని చెప్పగా, ఒకసారి కారులో ఎక్కి మాట్లాడమని సైబర్ నేరగాళ్లు చెప్పారు.
అదే విధంగా కారులో కూర్చుని ఏమిటండీ అని అడగ్గా, రానున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో నీకు కంచికచర్ల, మైలవరం, ఇబ్రహీంపట్నంలలో ఏదో ఒకటి టికెట్ ఇప్పిస్తా, డబ్బులు ఎంత పెట్టుకుంటావని అడిగారు. మరలా ఐదు నిమిషాల తర్వాత ఫోన్‌కాల్ చేసి అన్నగారు (చంద్రబాబు) మాట్లాడతారంటా అని చెప్పి, ఫోన్ ఇవ్వగా, ఆయన వాయిస్‌తోనే మాట్లాడారు. దీంతో ఏడుకొండలరావుకు అనుమానం వచ్చింది.
కొద్దిసేపటి ఒక రూ.లక్ష వేరేవారికి ట్రాన్స్‌ఫర్ చేయమని సైబర్ నేరగాళ్లు అడగ్గా, మరుసటి రోజు నేను క్యాష్ ఇస్తానని చెప్పి ఫోన్ పెట్టేశారు. మరుసటి రోజు ఫోన్ చేసి డబ్బులు విజయవాడలో ఎక్కడ ఇవ్వాలో చెప్పారు. 10వ తేదీ డబ్బులు ఇచ్చేందుకు రమ్మని చెప్పడంతో ఆయన బయలుదేరి నేరుగా గొల్లపూడిలోని దేవినేని ఉమా కార్యాలయానికి వెళ్లి, ఫోన్ చేసిన విషయం చెప్పారు. తాను ఫోన్ చేయలేదని చెప్పడంతో సైబర్ నేరగాళ్ల వల అని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.